తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy Counter To Kcr : మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. ప్రజలు ఏం కోల్పోలేదు : రేవంత్

Revanth Reddy Counter to KCR : మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు.. ప్రజలు ఏం కోల్పోలేదు : రేవంత్

11 November 2024, 14:48 IST

google News
    • Revanth Reddy Counter to KCR : గులాబీ బాస్ కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని.. తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ 10 నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్
సీఎం రేవంత్

సీఎం రేవంత్

బడి దొంగలను చూసాం కానీ.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. మీరు లేకపోయినా ఏం బాధలేదు.. మీతో ప్రజలకేం పని లేదు.. తెలంగాణ సమాజం మిమ్మల్ని మరిచిపోయిందని వ్యాఖ్యానించారు.

'పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతుండు.. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదు. ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. కోటి 5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు. నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది' అని రేవంత్ కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

'49 లక్షల 90 వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు. రూ.500 కే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21 వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది' అని సీఎం వ్యాఖ్యానించారు.

'కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు. కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు. మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం' అని రేవంత్ స్పష్టం చేశారు.

'త్వరలో గ్రూప్ 1 పరీక్షలు రాసిన వారికి నియామకపత్రాలు అందించి.. వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇవన్నీ చేసాం. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి.. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.. లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి' అని రేవంత్ కోరారు.

రవీంద్రభారతి కార్యక్రమంలో..

'రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారు. మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం,ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్‌లు. ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్' అని సీఎం వ్యాఖ్యానించారు.

'ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ పనిచేస్తోంది. దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోంది. దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ముస్లింలను మేం ఓటర్లుగా చూడటంలేదు.. సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు. అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది' అని రేవంత్ వివరించారు.

నియామక పత్రాలు అందజేత..

'పదేళ్ల బీఆరెస్ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో చిక్కుముడి విప్పుడుతూ.. పది నెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. మేం బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే నియామక పత్రాలు అందించి నిరుద్యోగుల తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూసాం. అది నాకు అత్యంత సంతృప్తి కలిగించిన సందర్భం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

'ఇక్కడ ఎంపికైన ఏఎంవీఐలకు ఈ వేదిక గా సూచన చేస్తున్నా. మీ గ్రామంలో విద్యార్థులు, నిరుద్యోగులతో మాట్లాడండి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేలా స్ఫూర్తి నింపండి. చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం అని వారికి విశ్వాసం కల్పించండి. ప్రభుత్వంపై నమ్మకం కలిగించండి. లీడర్ అంటే లీడ్ చేసేవాడు. అందరికీ రోల్ మోడల్ గా నిలిచేలా ఉండాలి.. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని రోల్ మోడల్‌గా తీసుకోవాలి. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగం. కాలుష్యం నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే రవాణా శాఖ సంపూర్ణ సహకారం ఉండాలి. త్వరలోనే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఒక పాలసీ తీసుకొస్తాం' అని సీఎం స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం