Revanth Reddy: కులగణనలో పాల్గొనకుంటే సామాజిక బహిష్కరణ చేయండి... పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
05 December 2024, 7:19 IST
- Revanth Reddy: కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కరణ చేయండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు ఎందుకు కులగణనలో పాల్గొన లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి పని చేస్తే స్వాగతించాలి కానీ అనవసరమైన విమర్శలతో తప్పుదారి పట్టించ ఎంత వరకు సమంజసమన్నారు.
పెద్దపల్లి యువవికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ సీఎంగా, ప్రధానమంత్రిగా 24 సంవత్సరాల్లో గుజరాత్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బహిరంగ చర్చకు రావాలని పెద్దపల్లి లో జరిగిన యువ వికాసం సభలో సీఎం డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలో యువ వికాసం పేరుతో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. 1024 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. గ్రూప్ -4 లో ఉద్యోగాలు సాదించిన 9007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. స్కిల్ యూనివర్సిటీ తో 9 కంపెనీలు ఓవోయు కుదుర్చుకున్నాయి. సీఎం కఫ్ ఆవిష్కరించారు.
కేసిఆర్ అసెంబ్లీకి రా... సీఎం
కేసిఆర్ లక్షా కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏడాదిలో కూలిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా ఖరీఫ్ సీజన్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని పండిన పంటకు సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తెలిపారు. కేసిఆర్ అనాడు వరి పంట వేయవద్దు అన్నాడని, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసిఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలో 25 లక్షల 30 వేల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. గుజరాత్ లో గానీ, దేశంలో ఎక్కడైనా రైతుల రుణ మాఫీ చేశారా? అని ప్రశ్నించారు.
కోటిమంది మహిళలు... కోటీశ్వరులు...
స్వయం సహాయక సంఘాల మహిళలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వం ఆడబిడ్డలను కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు. ఐకెపి కేంద్రాలు సోలార్ విద్యుత్ కేంద్రాలు ఆర్టీసీలో కిరాయి బస్సుల వంటి ప్రతి వ్యాపారంలో మహిళలను భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏడాదిలో 55143 ఉద్యోగాలు..
అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమేనని కానీ గత పదేళ్ళు పాలించిన కెసిఆర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 55143 ఉద్యోగాలు ఇచ్చి దేశంలో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. ఎవరు అడ్డు పడ్డా.. కృత్రిమ ఉద్యమం సృష్టించినా ఆగకూండా పట్టుబట్టి గ్రూప్ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పారు. ఆందోళనకు దిగిన వారితో మాట్లాడి వాస్తవం చెప్పి ముందుకు పోతున్నామని తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారని.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుంది బిఆర్ఎస్ తీరని దుయ్యబట్టారు.
పెద్దపల్లికి పెద్దపీట...
పెద్దపల్లి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన విజ్ఞాపనాలన్ని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పత్తిపాక, పాలకుర్తి రిజర్వాయర్ ల డిపిఆర్ తయారవుతుందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. రామగుండం ఎయిర్ పోర్ట్ పనులు చేపడతామని, మంథనిలో కొకకోలా కూల్ డ్రింక్ పరిశ్రమ స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పది మాసాల్లో మనం చేశామో చెప్పేందుకు ఈనెల 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విది విధానాలతో తాము ముందుకు పోతుంటే తండ్రీ కొడుకు అల్లుడు మా కాళ్ళలో కట్టెలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసిఆర్ ఏమైనా చెప్పదలుచుకుంటే అసెంబ్లీ రావాలని... సూచనలు సలహాలు ఇవ్వండని కోరారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)