తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Stray Dogs Attack: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు .. ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు

Stray Dogs Attack: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు .. ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు

HT Telugu Desk HT Telugu

Published Mar 21, 2025 06:36 AM IST

google News
    • Stray Dogs Attack: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కల బెడద జనాలను బెంబేలెత్తిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా.. ఆ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వరసు ఘటనలతో జనం బెంబేలెత్తి పోతున్నారు.
వీధి కుక్కల దాడిలో బాలికకు గాయాలు

వీధి కుక్కల దాడిలో బాలికకు గాయాలు

Stray Dogs Attack: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీధి కుక్కల బెడద జనాలను బెంబేలెత్తిస్తోంది. నిత్యం ఎక్కడో చోట వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాటి బారిన పడి కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంతమంది ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ మూడేళ్ల చిన్నారి వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా.. ఆ చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.


తల, ముఖంపై కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలపాలై ఆ చిన్నారి విల విలలాడటం అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద వంగర మండల కేంద్రానికి చెందిన చిలుక వెన్నెల మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో మూడేళ్ల వయసున్న చిన్న కూతురు నందిని గురువారం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లింది.

అక్కడి నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారి వెంట పడ్డాయి. చిన్నారిని నోట కరిచి తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి కేకలు విని స్థానికులు కుక్కలను తరిమి కొట్టగా.. అప్పటికే చిన్నారి తీవ్రంగా గాయపడి రక్త స్రావం జరిగింది.

కాగా కుక్కల దాడిలో గాయపడిన చిన్నారి తీవ్రంగా రోధించగా.. చిన్నారి తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా వేదనకు గురయ్యారు. కాగా చిన్నారి గాయాలతో విలవిలలాడుతుండటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చిన్నారిని అదే అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎంజీఎం డాక్టర్లు చిన్నారిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకుని ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

వారం కిందటే ఐదుగురిపై దాడి

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. వారం రోజుల కిందట మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలో వీధి కుక్కల గుంపొకటి స్వైర విహారం చేసింది. వీధుల్లో గుంపుగా సంచరిస్తూ రోడ్లపై ఉన్న ఐదుగురిని తీవ్రంగా కరిచాయి. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కాగా.. వారంతా ఆసుపత్రికి పరుగులు తీశారు.

కాగా నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి వీధి కుక్కల దాడులు జరుగుతుండటంతో అక్కడి జనాలు రోడ్ల మీదకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను బడికి పంపాలన్నా తల్లిదండ్రులు జంకుతున్నారు. ఓ వైపు వీధి కుక్కల భయం ఎక్కువవుతుండగా.. వాటి నియంత్రణకు అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వరుస దాడులు జరుగుతున్నా కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇకనైనా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. లేదంటే వీధి కుక్కలు జనాలపై దాడులు చేసి, ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో వీధి కుక్కల దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో తక్షణమే వాటి నియంత్రణకు తగిన చొరవ చూపాలని వేడుకుంటున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)