Chandrababu in Khammam : తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉంది : చంద్రబాబు
21 December 2022, 21:14 IST
- Chandrababu in Khammam : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. తాము వేసిన అభివృద్ధి పునాదులు తెలంగాణలో కొనసాగాయన్నారు. ఏపీలో మాత్రం విధ్వంసం సాగుతోందని.. గాడి తప్పిన ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి పథంలో పెట్టే బాధ్యత తనదే అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు
Chandrababu in Khammam :"విడిపోయిన రెండు రాష్ట్రాలని బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరూ మళ్లీ కలుపుతామని మాట్లాడరని" తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. "చేతకాని వ్యక్తులు కలిపేస్తామని అంటున్నారని" ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయినా.. తాము వేసిన అభివృద్ధి పునాదులు తెలంగాణలో కొనసాగాయన్నారు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆ అభివృద్ధి నమూనాలను చెడగొట్టలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఖమ్మం ఇల్లెందు క్రాస్ రోడ్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా జరిగిన తెలుగుదేశం శంఖారావం సభలో చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
తెలంగాణలో టీడీపీ ఎక్కడా ? అని ప్రశ్నించే వారికి ఖమ్మం సభలో ఉన్న అశేష జనవాహినే సమాధానమన్నారు చంద్రబాబు. తాము వేసిన పునాదుల మూలంగానే.. ఇవాళ తెలంగాణ .. అన్ని పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం నమోదు చేస్తున్న రాష్ట్రంగా అవతరించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇందుకు విరుద్ధంగా పాతాళానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాడి తప్పిన ఏపీ ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి పథంలో పెట్టే బాధ్యత తనదే అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్న బాబు... అవునా ? కాదా ? అని కార్యకర్తలను ప్రశ్నించారు. తెలుగుదేశంతో కలిసి నడిసేందుకు ఆసక్తి ఉన్న నాయకులకు ఆహ్వానం పలికారు. ప్రజా బలం ఉంటే.. నాయకులు లేకున్నా.. తయారు చేసుకునే శక్తి తమ పార్టీకి ఉందని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధికి నాంది పలికింది తానే అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఐటీ అభివృద్ధిని ముందే ఊహించి .. హైటెక్ సిటీ నిర్మాణం ప్రారంభించి 14 నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బోధించే కాలేజీలను పెంచామని అన్నారు. తెలుగు జాతి పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకే... ప్రపంచం మొత్తం కాలికి బలపం కట్టుకుని తిరిగి... అంతర్జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్ కి రప్పించామని చెప్పారు. అనేక ప్రయత్నాలు చేసి... ఇంటర్నెట్ విప్లవం తీసుకొచ్చిన బిల్ గేట్స్ ని హైదరాబాద్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. సెల్ ఫోన్ లతో టెలీకమ్యూనికేషన్ రంగంలో విప్లవం సృష్టించామని అన్నారు. సైబరాబాద్ తో హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టామని పేర్కొన్నారు. తాను ఆనాడు ఐటీ ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదా అని ప్రశ్నించారు.
భవిష్యత్తు బయోటెక్నాలజీదని గుర్తించి.. 2000వ సంవత్సరంలోనే హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ స్థాపించామని చంద్రబాబు అన్నారు. తద్వారా ఈ రోజు భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి దోహదపడిన పార్టీ టీడీపీ అని పునరుద్ఘాటించారు. చైనా సహా ఇతర దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందని.. కానీ మన వ్యాక్సిన్ బాగా పనిచేస్తోందని చెప్పారు. మళ్లీ జాగ్రత్తగా వ్యాక్సిన్ తీసుకుంటే.. మన దేశంలో మరో వేవ్ వచ్చినా తట్టుకుని నిలిచే శక్తి భారత్ కు ఉంది. ఆనాడు తాము కట్టిన కరగట్ట భద్రాచలం పట్టణాన్ని ఇటీవల వరదల నుంచి కాపాడిందని .. అది టీడీపీ దూరదృష్టి అని చెప్పారు.
తెలుగు వారి కోసం పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని చంద్రబాబు అన్నారు. 2 రూపాయలకు కిలో బియ్యంతో అందరికీ ఆహార భద్రత అందించిన గొప్ప నాయకుడని కీర్తించారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. తెలంగాణలో మొట్టమొదటగా గురుకులాలు స్థాపించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. అంతకముందు.. కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు.