తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది : కేటీఆర్

KTR : ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది : కేటీఆర్

21 November 2024, 16:10 IST

google News
    • KTR : తెలంగాణ రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు తీరుపై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లాలో తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు.
కేటీఆర్
కేటీఆర్

కేటీఆర్

వికారాబాద్ జిల్లా లగచర్ల బాధిత రైతులకు సంఘీభావంగా.. మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ గురువారం మహాధర్నా తలపెట్టింది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గురువారం మహబూబాబాద్‌లో పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.

'ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? అక్కడ గొడవలు ఏం జరగలేదు? మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరోవైపు బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. మహబూబాబాద్ గిరిజన మహా ధర్నాకు హైకోర్టు అనుమత ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు గిరిజన మహా ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినట్టువెల్లడించారు.

అయితే.. బీఆర్ఎస్ మహాధర్నాపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఎక్కడో వికారాబాద్‌లో ఘటన జరిగితే.. మహబూబాబాద్‌లో మహాధర్నా చేయడం ఏంటని ఎంపీ పోరిక బలరాం నాయక్ ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ చిచ్చు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

లగచర్ల ఘటనలో రైతులపై కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ రైతులను వదిలేయాలని డిమాండ్ చేస్తోంది. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ప్లాన్ చేస్తోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు వివిధ ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తూ.. లగచర్ల రైతులకు మద్దతు తెలుపుతున్నారు. సిద్ధిపేట, సంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ ధర్నాకు ప్లాన్ చేసింది.

తదుపరి వ్యాసం