KTR vs Revanth Reddy : మీ బర్త్ డే కేక్ కట్ చేయిస్తా.. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా: కేటీఆర్
08 November 2024, 12:06 IST
- KTR vs Revanth Reddy : కేటీఆర్ అరెస్టు అవుతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని ట్వీట్ చేశారు.
కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్‌లో బర్త్‌డే విషెస్ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చని స్పష్టం చేశారు. మీ బర్త్ డే సందర్భంగా కావాలంటే కేక్ కట్ చేయిస్తానని.. ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారాయి.
'ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్న మూసి పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారింది' అని కేటీఆర్ విమర్శించారు.
'ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తుంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపైన, హామీల అమలు వైఫల్యం పైన నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. నిర్బంధంలోకి తీసుకున్న మా పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డిలను, నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
'నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డిని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి? దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసివేయడానికి? దమ్ముందా? లేదా? సీఎం అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?!' అంటూ కేటీఆర్ ఘాటు ట్వీట్ చేశారు.
అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట చేరుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.