BRS : ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ... కడియంపై రాజయ్య సంచలన ఆరోపణలు
08 July 2023, 6:27 IST
- MLA Rajaiah vs MLC Kadiyam Srihari : ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజయ్య. కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని... ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని అన్నారు.
కడియంపై సంచలన ఆరోపణలు
Station Ghanpur : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ లోని అంతర్గత కలహాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధినాయకత్వం సూచనలతో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ... ఎన్నికలకు మరికొద్దిరోజులే టైం ఉండటంతో.... నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో సొంత పార్టీలోని ప్రత్యర్థులపై కూడా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నెలకొంది. ఇక్కడ ఎమ్మెల్యేగా రాజయ్య ఉండగా... ఇదే సీటును ఆశిస్తున్న కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎవరి వర్గాలు వారికంటూ ఉన్నాయి. సమయంతో సందర్భం దొరికితే చాలు.... ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే... శుక్రవారం ఎమ్మెల్యే రాజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడియం టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదని.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అన్నారు రాజయ్య. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి... ఎంతో మంది నియోజకవర్గ బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని ఆరోపించారు. శుక్రవారం తాటికొండ గ్రామంలో జరిగిన ఓ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... ఈ వ్యాఖ్యలు చేశారు. తాను త్యాగాలు చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చానని గుర్తు చేశారు రాజయ్య. కానీ కడియం శ్రీహరి ఎలాంటి త్యాగాలు చేయలేదన్నారు.
మళ్లీ నియోజకవర్గంలో కక్ష సాధింపులు వివక్షలు మొదలయ్యాయన్నారు ఎమ్మెల్యే రాజయ్య. దశాబ్ది ఉత్సవాలు ఎలా జరుపుకొన్నామో అలా కడియం శ్రీహరి వర్గం వారు నియోజకవర్గంలో అనేక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే కడియం శ్రీహరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి కుమార్తె ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని.. అసలు ఆమె ఎస్సీనే కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దూదేకుల వ్యక్తిని కడియం కుమార్తె పెళ్లి చేసుకుందని... అలాంటప్పుడు ఆమె ఎలా ఎస్సీ అవుతుందని నిలదీశారు. కడియం దగ్గర నాయకులంతా నా చేయికిందవాళ్లే అని కామెంట్స్ చేశారు.
అక్కడక్కడ దొంగ వీడియోలు ఆడియోలను పట్టుకొని బెదిరిస్తే భయపడను అని చెప్పారు రాజయ్య. పరోక్షంగా సర్పంచ్ నవ్య ఆరోపణలపై స్పందించారు. కోర్టుకు వెళ్లి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి తస్మాత్ జాగ్రత్త.... నీతో తిరిగే వారందరూ బీఆర్ఎస్ నుంచి బహిష్కరించిన వారే అని చెప్పారు. కడియం శ్రీహరి ఇక నుంచి రోజూ గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తానని అన్నారు.