తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Koushik Reddy Arrest: Mla కౌశిక్‌ రెడ్డి అరెస్ట్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Koushik Reddy Arrest: MLA కౌశిక్‌ రెడ్డి అరెస్ట్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

14 January 2025, 10:13 IST

google News
    • Koushik Reddy Arrest: కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దౌర్జన్యం చేసిన వ్యవహారంలో  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డిపై నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై  హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసి కరీంనగర్‌ తరలించారు. 
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

Koushik Reddy Arrest: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా సమీక్షలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నించారంటూ కరీంనగర్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై 4 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్‌ రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం ఉదయం కోర్టు కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

కరీంనగర్‌ జిల్లా సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే కౌశిక్ రెడ్డి సమావేశంలో సంజయ్‌పై దాడికి యత్నించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యా దులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోద య్యాయి.

కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేయిచేసుకున్నారని సంజయ్ పీఏ వినోద్ ఫిర్యాదు చేశారు. సమావేశానికి వెళ్లిన తనపై కౌశిక్ రెడ్డి అనుచితంగా ప్రవర్తించి అందరి సమక్షంలో తిట్టారంటూ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ మరో ఫిర్యాదు చేశారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనతో అంతరాయం కలిగిందంటూ కరీంనగర్ ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై పోలీసు ఉన్నతాధికా రులు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ముందే సమాచారమిచ్చారు. కౌశిక్ రెడ్డి హైదరాబాద్ లో ఉండడంతో కరీంనగర్ పట్టణ ఏసీపీ వెంకటస్వామి నేతృత్వంలో టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి , 30 మందికి పైగా టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వచ్చారు.

జూబ్లీ హిల్స్‌లో ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొని బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డిని రాత్రి 7 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఆయనను పోలీసు| వాహనంలో రాత్రి 10.35 సమయంలో కరీంనగర్‌ తీసుకెళ్లారు. పోలీసు శిక్షణ కేంద్రాని (పీటీసీ)కి తరలిం చారు. అర్ధరాత్రి దాటాక త్రీ టౌన్‌ పీఎస్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్టుతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరోవైపు ఆదివారం జరిగిన సంఘటన పై కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులపై ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కరీంనగర్ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత స్పీకర్‌కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన

ఎమ్మెల్యే అరెస్టు సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం