KTR House Arrest: గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ నేతలు.. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
14 January 2025, 9:50 IST
- KTR House Arrest: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంతో బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేటీఆర్, హరీశ్ రావుల ఇళ్ల ముందు భారీగా పోలీసుల్ని మొహరించారు.

గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ నేతలు
KTR House Arrest: పండుగ పూట బీఆర్‌ఎస్ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన గొడవ నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి జూబ్లిహిల్స్‌లో అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం కౌశిక్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనుండటంతో బీఆర్‌ఎస్ నేతలు కరీంనగర్ వస్తారనే అనుమానంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో కేటీఆర్ ఇంటి ముందు, కోకాపేటలోని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేతలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఆందోళనలు జరపకుండా ఆ పార్టీ నేతల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉంచారు.
కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు..
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యేపై దౌర్జన్యం చేసి దూషించినందుకు కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక న్యూస్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనల తర్వాత కౌశిక్ రెడ్డికి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. పదివేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలతో బెయిల్ జారీ చేశారు.