తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao Warning : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్!

Harish Rao Warning : బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం.. పోలీసులకు హరీష్ రావు మాస్ వార్నింగ్!

29 October 2024, 15:58 IST

google News
    • Harish Rao Warning : మాజీమంత్రి హరీష్ రావు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అతి చేసిన పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.
హరీష్ రావు
హరీష్ రావు

హరీష్ రావు

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారని.. మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న స్పెషల్ పోలీసుల మీద నమ్మకం లేక.. వాళ్లని తొలగించారని సైటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వ శాఖను తన దగ్గర పెట్టుకొని.. పోలీసుల మీద నమ్మకం లేదంటే ఎలా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

పోలీసులపైనా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాము. మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

'ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కొత్త పథకాలు రాలేదు..పాత పథకాలు ఆపేస్తున్నారు. కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు ఆపేశారు. బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని చెప్పి.. ఒక్క చీర కూడా ఇవ్వలేదు. వరంగల్‌ డిక్లరేషన్‌లో హామీలు ఇచ్చి మరిచిపోయారు. దేవుని మీద ఓట్లు.. అడిగితే తిట్లా.. నువ్వు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి. పెన్షన్లు ఇవ్వలేదని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే బేగం బజార్లో నా మీద కేసు పెడుతావా.. బిడ్డా బేగం బజార్ కాదు ఏ బజార్లో కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా' హరీష్ రావు స్పష్టం చేశారు.

'నాడు వలసల వనపర్తి నేడు వరి కోతల వనపర్తి అయ్యింది. గతంలో నీళ్లు లేక వనపర్తి నుండి పాలమూరు నుండి రైతులు వలసలు వెళ్ళేవారు. కానీ కేసీఆర్ హయాంలో నిరంజన్ రెడ్డి మంత్రిగా కాలువలు తవ్వించి, ప్రాజెక్టులు కట్టి వలసల వనపర్తిని వరి కోతల వనపర్తిగా తీర్చిదిద్దారు. గతంలో వనపర్తి జిల్లాలో కేవలం 10 వేల ఎకరాల్లో వరి పంట పండిస్తే, కేసీఆర్ హయాంలో 1 లక్ష 10 వేల ఎకరాల్లో వరి పంట వేశారు. ఇప్పుడు వనపర్తిలో ఎక్కడ చూసినా వరి పంటలు, చెరువుల్లో నీళ్లు నిండి ఉన్నాయి' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

'కేటీఆర్‌ను డ్రగ్స్‌ కేసులో ఇరికించే కుట్ర చేశారు. ప్రభుత్వం టార్గెట్ రాజ్ పాకాల కాదు కేటీఆర్.. కేటీఆర్ ఫామ్‌ హౌస్‌ పార్టీకి వస్తారని భావించారు. ఆయనను ఏదోరకంగా డ్రగ్స్ కేసులో ఇరికించాలనుకున్నారు. 25 రోజుల కిందట నాపై కూడా ఇలాంటి కుట్ర చేశారు' అని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ సంబరాలు..

కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని మోపాలనే ప్రయత్నాన్ని ఆపినందుకు.. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చింది. బుధవారం ఈ సంబరాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం