BRS : ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ 'రిచ్'.. ఖాతాల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నాయో తెలుసా?
23 November 2024, 9:41 IST
- BRS : బీఆర్ఎస్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని రిజనల్ పార్టీల్లో బీఆర్ఎస్ రిచ్ అని వెల్లడైంది. అటు టీడీపీ, వైసీపీ ఖాతాల్లో ఉన్న ముగింపు నిల్వలను కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. టీడీపీ అకౌండ్‌లో రూ.272 కోట్లు ఉన్నాయి.
కేసీఆర్
భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ ఖాతాల్లోనే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల వివరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఆడిట్ నివేదికను సమర్పించింది. దీన్ని ఎలక్షన్ కమిషన్ తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ ఖాతాల్లో 1,449 కోట్ల రూపాయలు ఉన్నాయి.
ఇప్పటివరకు ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ పార్టీ రూ.625 కోట్ల ముగింపు నిల్వలతో మొదటి స్థానంలో ఉండేది. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ దాన్ని అధిగమించింది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి బీఆర్ఎస్ అకౌంట్లలో రూ.1,519 కోట్లు ఉన్నాయి. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి ముగిసేలోపు రూ.47.56 కోట్ల విరాళాలు వచ్చాయి.
ఎన్నికల ప్రచారం, ఇతర కార్యక్రమాలకు రూ.120 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ నివేదికలో వెల్లడించింది. వివిధ రకాల మాధ్యమాల్లో ప్రచారానికి రూ.10.51 కోట్లు, ప్రచార సామాగ్రికి రూ.34.68 కోట్లు, బహిరంగసభలు, ఊరేగింపులు, ర్యాలీలకు రూ.20.37 కోట్లు, ఇతర ప్రచారానికి రూ.34.39 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదిక బీఆర్ఎస్ స్పష్టం చేసింది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థులకు రూ.95 లక్షల చొప్పున మొత్తం రూ.16.15 కోట్లు నేరుగా చెక్, డీడీ రూపంలో ఇచ్చినట్లు బీఆర్ఎస్ వెల్లడించింది. అభ్యర్థుల నేరచరిత్రపై ప్రకటనల కోసం రూ.73.17 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. ఇక ఇతర రీజనల్ పార్టీల్లో తమిళనాడులోని డీఎంకే ఖాతాలో రూ.338 కోట్లు, సమాజ్‌వాదీకి రూ.340 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ.272 కోట్లు, జేడీయూకు రూ.147 కోట్లు, జగన్ పార్టీ వైసీపీ ఖాతాలో రూ.27 కోట్ల ముగింపు నిల్వలు ఉన్నాయి.