Raghunandan Vs Niranjan Reddy: మంత్రి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించిన రఘునందన్ రావు, ఖండించిన నిరంజన్ రెడ్డి
19 April 2023, 5:54 IST
- Raghunandan Vs Niranjan Reddy: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి ఫాం హౌస్‌లలో ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపించారు. బినామీ పేర్లతో భూముల్ని కబ్జా చేశారని రఘునందన్ ఆరోపించారు.
నిరంజన్ రెడ్డి భూముల్ని కబ్జా చేశారని ఆరోపిస్తున్న రఘునందన్ రావు
Raghunandan Vs Niranjan Reddy: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లో ప్రభుత్వ భూములు, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు.
కృష్ణానదిని పూడ్చేసి మంత్రి ఏకంగా ప్రహరీ నిర్మించుకున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌజ్ నిర్మించారని తెలిపారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కూడా కట్టారని తెలిపారు. ఫాంహౌస్‌లో సగం పట్టా భూములు ఉండగా మిగిలినవి ఇతర భూములని రఘునందన్ తెలిపారు. గిరిజనుల పేరుతో ఉన్న భూములు తర్వాత కంపెనీల పేర్లతో మారి చివరికి ఎవరి పేరుతో మారిపోయాయో పరిశీలించాలని డిమాండ్ చేశారు.
మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్ అయి రెవెన్యూ రికార్డులు కాలిపోయాయని, ఇప్పుడు రికార్డులు లేవని అంటున్నారని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై ఇంతవరకూ ఛార్జిషీట్ వేయలేదన్నారు.పాతపహాణీలను పరిశీలిస్తే ఆర్డీఎస్ కోసం సేకరించిన 17 ఎకరాలు ఇప్పుడు పట్టా భూములుగా మారాయన్నారు. ఫాంహౌస్‌లో కృష్ణానది భూములు లేవని, తహసీల్దార్ కార్యాలయం అగ్నిప్రమాదంలో పెద్దల హస్తంలేదని..మంత్రి తాను నమ్మే గట్టుకాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడిదగ్గర ప్రమాణం చేస్తారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఫాంహౌస్ భూములపై తీసుకున్న ఆయిల్‌పాం సబ్సిడీ, ఎస్టీ నిధులతో వేసిన రోడ్లపై వాస్తవాలను మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించాలన్నారు.
వ్యవసాయ మంత్రికి జిల్లాలో మూడు ఫాంహౌస్‌లు ఉన్నాయని, మిగతావాటిలో జరిగిన అక్రమాలను వరుసగా వెల్లడిస్తానన్నారు. తప్పు చేస్తే తనయుడినైనా, కుమార్తెనైనా శిక్షిస్తానని రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. మంత్రులందరికీ ఒకే న్యాయం వర్తిస్తుందో లేదో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూముల వ్యవహారం తరహాలోనే వ్యవసాయ మంత్రి ఫాంహౌస్ భూముల అంశంలోనూ వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.
ఆరోపణల్ని ఖండించిన మంత్రి నిరంజన్ రెడ్డి…
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రాజకీయ దురుద్దేశంతోనే రఘునందన్ రావు తనపై ఆరోపణలు చేశారన్నారు. స్వగ్రామంలో ఉన్న భూములు 2014, 2018 ఎలక్షన్ అఫిడవిట్ లో పేర్కొన్నవేనని చెప్పారు. తన పిల్లల కష్టార్జీతంతో వాటిని కొన్నట్లు మంత్రి చెప్పారు. రఘునందన్ రావు పరిస్థితి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు.
న్యాయంగా, చట్ట ప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను తన పిల్లలు వదిలేస్తారని సవాలు చేశారు. ఆక్రమణలకు పాల్పడినిట్లు తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేకుంటే అసత్య ఆరోపణలు చేసిన రఘునందన్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. రఘునందన్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది తన భార్య సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు అని మంత్రి ప్రకటించారు. విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన ఇద్దరు కుమార్తెలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు కొన్నారని చెప్పారు. ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకునారనే ఆరోపణల్నిమంత్రి ఖండించారు.
తల్లితండ్రులను కోల్పోయిన గౌడ నాయక్ ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసని, అతను తమ కుటుంబసభ్యుడేనని .. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడేనని మంత్రి చెప్పారు.
భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకున్నామని చెప్పారు. పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి అని ఆరోపించారని, అది వెల్టూరు గ్రామ పరిధిలోనిదని అక్కడ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న మరదలు కవిత , వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమే అని మంత్రి చెప్పారు. అక్కడ కూరగాయల తోటలు ఉన్నాయని, దానికి ప్రభుత్వం నుండి ఏ రహదారి మంజూరు కాలేదన్నారు. వారు ఇక్కడ ఉండరని, అప్పుడప్పుడు పర్యవేక్షణకు వెళ్తుంటానని చెప్పారు.
మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్ ను తీసుకుని వెళ్లొచ్చని, ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నానని, న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను మా పిల్లలు వదిలేస్తారని సవాలు చేశారు. తాను కూడా పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే రఘునందన్ పదవికి రాజీనామా చేయాలన్నారు.