Rega Kantha Rao Vs Podem Veeraiah :వేదికపైనే కొట్టుకోబోయిన బీఆర్ఎస్,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు-లేచి పక్కకు వెళ్లిపోయిన మంత్రి
10 May 2023, 15:16 IST
- Rega Kantha Rao Vs Podem Veeraiah : భద్రాద్రి కొత్తగూడెం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొట్టుకున్నంత పనిచేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాటాల తూటాలు పేల్చుకున్నారు.
రేగా కాంతారావు వర్సెస్ పోదెం వీరయ్య
Rega Kantha Rao Vs Podem Veeraiah : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి ముందే బాహాబాహీకి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంతే అంటూ మాటలతో యుద్ధం చేసుకున్నారు. పక్కనున్న వాళ్లు కల్పించుకోకపోతే... ఫైట్ కు సిద్ధమయ్యారు ఎమ్మెల్యేలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలోని లక్ష్మినగరంలో తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు (బీఆర్ఎస్), భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య (కాంగ్రెస్) కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై పొగడ్తలు కురిపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య అభ్యంతరం తెలిపారు. దీంతో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టుకున్నారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు వారిని వారించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుటే ఇరువు నేతలు మాటాల యుద్ధం చేసుకోవడం గమనార్హం.
లేచి పక్కకు వెళ్లిపోయిన మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదం నెలకొంది. బహిరంగ సభలో ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నంత పనిచేశారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య మాటల తూటాలు పేలాయి. తునికి ఆకుల సేకరణ చెక్కుల పంపిణీల కార్యక్రమంలో రేగా కాంతారావు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పై మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆయన రేగా కాంతారావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. ఇద్దరూ గొడవ పడుతున్న క్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడ నుంచి లేచి పక్కకు వెళ్లిపోయారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దర్నీ వారించారు. ఇరు ఎమ్మెల్యేల అనుచరులు ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేశారు.
పంచాయతీ ఉద్యోగిపై బీఆర్ఎస్ నాయకులు దాడి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించాడని ఆరోపిస్తూ పంచాయితీ ఉద్యోగిపై బీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం ములుగు జిల్లాలో కలకలం రేపింది. ములుగు జిల్లా వెంకటాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి జనార్దన్‌పై మంగళవారం సాయంత్రం బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారు. కారులో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న జనార్థన్‌ను అడ్డగించి కాళ్లతో తన్నుతూ బయటకు లాగి దాడిచేశారు. ఈ ఘటనలో అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరికొందరు ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ములుగు కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మద్దతుగా మంగళవారం తీన్మార్ మల్లన్న బృందానికి చెందిన సభ్యుడొకరు మాట్లాడారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. సమ్మె చేస్తున్న కార్యదర్శులు ఆయనను చప్పట్లతో ప్రోత్సహించారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ నాయకులు జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై దాడికి దిగారు.