Bear attack : మెదక్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం..! పొలం వద్ద రైతుపై దాడి
28 August 2024, 11:43 IST
- పొలం వద్ద పనులు చేసుకుంటున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. పక్క పొలంలో పనులు చేసుకుంటున్న మరో ఇద్దరు రైతులు వచ్చి.. ఎలుగుబంటి దాడి నుంచి కాపాడారు. ఈ దాడి ఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘన్పూర్ మండల పరిధిలో జరిగింది.
ఎలుగుబంటి (representative image )
ఉదయమే పొలానికి వెళ్లిన ఓ రైతుపై హఠాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని హవేళిఘన్పూర్ మండలంలోని దూప్ సింగ్ తండా లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే… దూప్ సింగ్ తండాకు చెందిన రైతు మెగావత్ రవి(45) అడవికి దగ్గర్లో ఉన్న తన పొలానికి సోమవారం ఉదయమే వెళ్ళాడు. పొలంలో పని చేసుకుంటున్న రవి.. తన దగ్గరికి ఎలుగుబంటి వచ్చేవరకు కూడా గుర్తించలేకపోయాడు. ఒక్కసారిగా రవిపైకి దూకిన ఎలుగుబంటి దాడికి దిగింది. తీవ్రంగా గాయపరిచింది.
కాపాడంటూ అరుపులు విని..…!
‘కాపాడండి, కాపాడండి’ అంటూ రవి చేసిన అరుపులు విని పక్క పొలంలో పని చేస్తున్న రైతులు సురేష్ నాయక్, మోహన్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు కట్టెలు చేతబట్టి ఎలుగుబంటి నుంచి రవిని కాపాడడానికి వచ్చారు. కట్టెలు తీసుకొని వస్తున్న రైతులను చుసిన ఎలుగుబంటి… భయంతో రవిని వదిలి అడవిలోకి పారిపోయింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందజేసి… రవిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన రవిని ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసిన మెదక్ అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతులు సురేష్, మోహన్ ద్వారా వివరాలను తెలుసుకున్నారు.
రైతులను ఉద్దేశించి మాట్లాడిన అటవీ శాఖ అధికారులు… రైతులు ఎవరు కూడా అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. ఎలుగుబంటి కదలికలపై నిఘా పెట్టాలని ఫారెస్ట్ వాచర్లకు ఆదేశిలిచ్చారు. రైతు రవి కుటుంబాన్ని… ఫారెస్ట్ చట్టానికి లోబడి ఆదుకుంటామని హామీనిచ్చారు.
ఇదే మొదటిసారి........
మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చిరుతపులులు అటవీ నుంచి బయటకు రావటం, పశువులను చంపటం వంటి సంఘటనలు తరచుగా జరుగుతుంటాయి. కానీ ఎలుగుబంటి అడవి నుంచి బయటకి రావడం… మనుషులపై దాడి చేయటం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి. ఈ సంఘటన చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులను, పశువుల కాపరులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసింది.
అడవిలోకి పశువులను పంపాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు జీవనాధారమైన పశువుల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఎలుగుబంటిని ఎలాగైనా పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో వదలాలని స్థానిక ప్రజలు, రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.