పంచాయతీ నిధులను పక్కదారి పట్టించింది నిజం కాదా..? కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
19 May 2022, 13:51 IST
- ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కమీషన్ల కోసమే పంచాయతీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. తప్పులను ప్రశ్నించిన సర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్నదనేది నిజం కాదా అని నిలదీశారు.
కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ (ఫైల్ ఫోటో)
పంచాయతీరాజ్ నిధులను టీఆర్ఎస్ సర్కార్ పక్కదారి పట్టించింది నిజం కాదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర బుద్దిని చూడలేకే... కేంద్రం నుంచి నేరుగా గ్రామాలకు నిధులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో సర్పంచ్ లు అడుక్కుతినే దుస్థితికి వచ్చారనేది వాస్తవం కాదా అని నిలదీశారు.
ఏమన్నారంటే...
విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా... రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడుస్తూ గ్రామ పంచాయతీల అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల సహా వివిధ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్ ది చిల్లర బుద్ది కాక ఏమనాలి?
•గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నారు. కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటున్నారు. కేంద్ర నిధులను జీతాలకు మళ్లిస్తోంది. గ్రామాల్లో చేసిన అభివ్రుద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కేసీఆర్ చేతగానితనంవల్ల సర్పంచులు ఉన్న ఆస్తులను అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్ మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇవన్నీ నిజం కాదా..?
•ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వకుండా ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి నిధులివ్వకుండా తండాలను నిర్వీర్యం చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ అవినీతిని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులపై నిలదీస్తున్న సర్పంచులపై అక్రమంగా కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి మడుగులొత్తే ప్రజా ప్రతినిధులను అందలమెక్కిస్తూ.. ఇతర పార్టీల సర్పంచులు-ఉప సర్పంచుల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయాలన్నీ వాస్తవం కాదా..?
•కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో వేల కోట్ల కమీషన్లు దండుకుని తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించి అప్పుల కుప్పగా మార్చారు. ఇలాంటి కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు.
•కేంద్రం నుంచి రాష్ట్రాలకు వికేంద్రీకరణ జరగాలని నీతులు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాల నుంచి గ్రామాలకు నిధులు, విధులను ఎందుకు వికేంద్రీకరించడం లేదో రాష్ట్ర ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి.
•జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నా... వాటిని నెలల తరబడి చెల్లించకుండా కూలీలను అరిగోస పెడుతున్నది వాస్తవం కాదా?
•కష్టాల్లో పేదలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు కేంద్రం ప్రతినెలా 5 కేజీల బియ్యం ఉచితంగా పంపిస్తే... వాటిని అందకుండా చేసి పేదల నోటికాడ ముద్దను లాక్కుంటున్నది కేసీఆర్ కాదా?
•గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల కోసం నిధులిస్తే.. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఒకే సంస్థకు కట్టబెట్టేలా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపాలంటూ హుకూం జారీ చేశారు. ఇది నిజం కాదా...?
•గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులకు కేంద్రం నిధులిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయా నిధుల్లోనూ అవినీతికి ఆస్కారం ఇచ్చేలా నచ్చిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగిస్తున్నారు.
•కేసీఆర్ అవినీతిపై సర్పంచులు పెద్ద ఎత్తున గళమెత్తడంతో పాటు నేరుగా పంచాయతీలకు నిధులివ్వాలంటూ కేంద్రానికి లేఖలు రాసిన మాట నిజం కాదా? కేంద్రం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో నేడు అభివ్రుద్ధి జరుగుతున్నది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా కేసీఆర్ అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో వికేంద్రీకరణే లక్ష్యంగా కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిస్తుంటే... ఓర్వలేక కేసీఆర్ పిచ్చిప్రేలాపనలు చేయడం సిగ్గు చేటు.
• గ్రామ పంచాయతీలంటే ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి కేసీఆర్. జాతీయ పంచాయతీ రాజ్ దివస్ సందర్భంగా అన్ని రాష్ట్రాలు ఏటా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కేసీఆర్ ఇకనైనా మానుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
టాపిక్