Bandi sanjay: సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని కాంగ్రెస్ నేతల్ని బండి సంజయ్ డిమాండ్
21 June 2024, 12:35 IST
- Bandi sanjay: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ కు ఉందా? అంటూ కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రపంచ యోగా దినోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
Bandi sanjay: సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన సందర్భంలో ప్రకటించారని స్పష్టం చేశారు. ఇంకా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యంకాదని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జ్యోతినగర్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
సింగరేణిపై కాంగ్రెస్ టిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను అయోమయం చేసే కుట్ర జరుగుతుందన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉందని... అట్లాంటప్పడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం సీఎం కేసిఆర్ అని ఆరోపించారు. తాడిచర్ల ఓఫెన్ కాస్ట్ బొగ్గుగనిని ఏపీ జెన్ కోకు ఇస్తే... కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా? అన్నారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆయన మూర్ఖత్వపు ఆలోచనవల్ల సింగరేణిని పూర్తిగా దెబ్బతీశారని, తన కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే... సింగరేణి కార్మికుల పట్ల ప్రేమ ఉంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. నిన్న ఓ టీవీ ఛానల్ చర్చలో బీజేపీ ఎస్సీ మోర్చా నేత ఎస్.కుమార్ సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని ప్రశ్నిస్తే... కాంగ్రెస్ నేత మాట్లాడుతూ తప్పనిసరిగా సింగరేణిపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి లేఖ రాసే దమ్ముందా? అని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్…
కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో పొట్టుపొట్టు అవినీతి చేస్తే... కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందన్నారు బండి సంజయ్. కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారని విమర్శించారు.
కాంగ్రెస్ కూడా అంతే.... ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్ప వేరే ఆలోచనలే లేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, అసలు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం కేంద్రానికి సాధ్యమే కాదని తెలిపారు.
సర్వరోగ నివారిణి యోగా..
ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2014లో ఐక్య రాజ్యసమితిలో మోదీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగాప్రకటించాలని ప్రతిపాదించడంవల్లే గత పదేళ్లుగా జూన్21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.
అన్ని రోగాలకు పరిష్కారం యోగా అని, చిన్నా పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలని కోరారు. మన శ్రేయస్సుతోపాటు సమాజ శ్రేయస్సు అనే నినాదంతో ఈసారి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతత పొందాలంటే యోగా తప్పనిసరి చేయాలని కోరారు. 196 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. మన శ్రేయస్సుతోపాటు సమాజ శ్రేయస్సుకోసం యోగ పరిష్కారంగా భావిస్తున్నామని చెప్పారు.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)