Amit Shah Munugode : ‘రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది’
21 August 2022, 19:20 IST
- Amit Shah Munugode : మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
మునుగోడు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం
Amit Shah Munugode visit : కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని మండిపడ్డారు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆరోపించారు.
మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. మునుగోడు అభివృద్ధికి ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూనే.. ఈ ప్రాంతానికి కేసీఆర్ ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు.
"ఇన్నేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు. దళితుడిని సీఎం చేస్తానని అప్పట్లో కేసీఆర్ అన్నారు. చేశారా? టీఆర్ఎస్కు ఓటు పడితే.. కేసీఆర్ ఎన్నిసార్లైనా సీఎం అవుతారు. దళితబంధును ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు? రెండు పడకల గదులు ఉన్న ఇళ్లులు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేదు. కేంద్రం నిర్మిస్తున్న టాయిలెట్లను కూడా ఆయన అడ్డుకోవడం దురదృష్టకరం. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. ఇచ్చిందా? రైతులను.. కేసీఆర్, ఆయన కుటుంబం తీవ్రంగా మోసం చేసింది. పీఎం ఫసల్ బీమాను తెలంగాణలో అమలు చేయనివ్వడం లేదు. రైతులు నష్టపోతున్నారు," అని మండిపడ్డారు అమిత్ షా.
ఇదే సభలో.. కాంగ్రెస్ మాజీ నేత రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్ షా సమక్షంలో.. రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు.. బీజేపీలోకి చేరారు. రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా.. ఆయనకు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 'రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. 'టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి పారేసినట్టే,' అంటూ వ్యాఖ్యానించారు.
రానున్న ఎన్నికల్లో గెలిచి.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్రమంత్రి జోస్యం పలికారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేంద్ర, విజయశాంతి సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌తో షా భేటీ..!
Amit Shah NTR meet : అంతకుముందు.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బేగంపేట్ విమానాశ్రయంలో దిగారు అమిత్ షా. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆలయానికి వెళ్లిన అమిత్ షా.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అక్కడి నుంచి సాంబమూర్తి నగర్‌లోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు షా. అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు సమయం గడిపారు.
కాగా.. ఈ రోజు రాత్రికి.. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ని అమిత్ షా కలుస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. అనూహ్యంగా వీరి మధ్య భేటీ జరుగుతుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.