తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Flood Loss : రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

Adilabad Flood Loss : రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

HT Telugu Desk HT Telugu

14 September 2024, 16:12 IST

google News
    • Adilabad Flood Loss : ఇటీవల భారీ వర్షాలు, వరదలు రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ప్రాణహిత, పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో పత్తి, సోయా, కంది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లో 9500 ఎకరాల్లో పం టనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు
రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

రైతుల కష్టం గంగపాలు, నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

Adilabad Flood Loss : ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు, అన్నదాతల ఆశల సౌదాన్ని కుప్పకూల్చగా మరోవైపు ప్రభుత్వ ఆస్తులకు ఊహించని నష్టం వాటిల్లింది. గోదావరి ప్రాణహిత, పెన్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో పంట చేలలోకి వరదలు ముంచెత్తి చేతికొచ్చే దశలో ఉన్న పత్తి ,సోయా కంది పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసి రైతుల ఆశలను నీరుగార్చాయి. ఊహించని వరద విపత్తుతో పుట్టెడు దుఖంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కోకావాల్సివస్తుంది.

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా నది రైతుల పాలిట శాపంగా మారింది. భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పెన్ గంగా నది పరివాహక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో రైతులు వేసిన పత్తి, కంది పంటలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు నాశనం కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాల్లో ఇటీవల నాలుగైదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వరదలకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు, అయితే ఆస్తి నష్టం మాత్రం పెద్ద మొత్తంలో జరగడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన నష్టం వివరాలు సేకరించేందుకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖాధికారులు నోడల్ టీంలుగా ఏర్పడి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు క్షేత్రస్థాయిలో నట మునిగిన పంటపొలాలను పరిశీలించి జరిగిన నష్టంపై నివేదికలను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదించారు.

ఉమ్మడి జిల్లాల్లో 9500 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు వేల ఎకరాల్లో పంట నష్టం ఆదిలాబాద్ జిల్లాలోని పెన్ గంగా నదీ, కడెం, తదితర వాగుల తీర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలపైనే పంటలు వరద నీటిలో మునిగి పెను నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా పత్తి, సోయా ,కంది పంటలకు భారీ నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారుల సర్వేలో తేలింది. గతవారం రోజులుగా పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు సందర్శించి గ్రామాల వారిగా పంటనష్టం వ వరాలను నివేదిక రూపం లో ప్రభుత్వానికి నివేదించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2980 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతినగా వీటిలో 2300 ఎకరాల్లో పత్తి పంట, 620 ఎకరాల్లో సోయాబిన్, మిగితా 300 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అంచనావేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ మేరకు జిల్లాకలెక్టర్లు అభిలాష అభినవ్, రాజర్షిషా, తదితర అధికారులు వారి వారి జిల్లాలలో నీట మునిగిన పంటలను, గ్రామాలను సందర్శించి పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బెదోడ, సాంగిడి గ్రామాల శివారులోనే ఆరువందల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జైనథ్ మండలంలోనే అత్యధికంగా పంట నష్టం జరిగినట్లు ఆతర్వాత బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కలు వేసి సర్కారుకు నివేదిక సమర్పించారు. 730 మంది రైతులకు ఈ జిల్లాలో పంటనష్టం వాటిల్లినట్లు బ్యాంకు అకౌంట్ నెంబర్లను సేకరించారు.

ఎకరానికి పదివేలు పరిహారం

పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ఇళ్ల కూలిపోయిన వారికి రూ.16500 అందిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష తెలిపారు. క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన రైతులకు వెంటనే సర్కారు సాయం చేసి ఆదుకుంటామని, నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లు, తెగిపోయిన కల్వర్టులు

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరద తాకిడికి పెద్ద మొత్తంలో రోడ్లు, వంతెనలు కల్వర్టులు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులతో పాటు మారుమూలగ్రామాలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఒక్క కొమరంభీం జిల్లాలోనే రూ.211 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించారు.

రహదారులకు తాత్కాలికంగా దెబ్బతిని వాటి మరమ్మత్తుల కోసం రెండు కోట్ల రూ.90 లక్షలు అంచనా వేయగా ప్రధాన రహదారులకు పెద్ద మొత్తంలో భారీ వర్షాలు దెబ్బతీశాయి. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లో రూ.208 కోట్ల నష్టం వాటిల్లినట్లు వీటిలో కొన్ని కల్వర్టులు, రహదారులు కోతకు గురైనట్లు ప్రభుత్వానికి అంచనా నివేదిక సమర్పించారు. శాశ్వతంగా రూ.146 కోట్ల నష్టం వాటిల్లగా ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రధాన మార్గం సైతం భారీ వర్షాలకు దెబ్బతిని గతుకులమయంగా మారడం గమనార్హం.

రిపోర్టింగ్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం