TGPSC Group 1 Exams : గ్రూప్ 1 పరీక్షలో కాపీ కొట్టేందుకు యత్నం..! పట్టుబడిన మహిళా అభ్యర్థి
26 October 2024, 7:30 IST
- తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాపీయింగ్‌కు యత్నించిన మహిళా అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీజీపీఎస్సీ… సదరు విద్యార్థిని తదుపరి పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో కాపీయింగ్ ఘటన వెలుగు చూసింది. కాపీయింగ్ కు యత్నించిన ఓ మహిళా అభ్యర్థిని సిబ్బంది గుర్తించింది. ఎడమ చేతిపై కొన్ని రాతలు కనిపించాయి. ప్రశ్నపత్రం ఇవ్వకముందే గమనించిన ఇవ్విజిలెటర్లు… తనిఖీ చేశారు. చేతిపై ఆన్సర్లు రాసుకొచ్చినట్లు గుర్తించారు.
వివారల్లోకి వెళ్తే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శుక్రవారం ‘ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్’ పేపర్ పరీక్ష జరిగింది. ఇబ్రహీపట్నంలోని సీవీఆర్ కాలేజీలో ఓ మహిళా అభ్యర్థి పరీక్షకు హజరైంది. చేతిపై రాతలు ఉండటంతో గుర్తించిన ఇన్విజిలెటర్లు… ఆమెను పరీక్ష కేంద్రం నుంచి బయటికి పంపారు. చేతిపై ఆన్సర్లు రాసుకొచ్చినట్లు గుర్తించి డీబార్ చేయించారు. సదరు మహిళా అభ్యర్థి ప్రభుత్వ టీచర్ అని సమాచారం.
మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు - TGPSC ప్రకటన
గ్రూప్ 1 పరీక్షలో కాపీయింగ్ ఘటన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్పందించింది. ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఎగ్జామ్ సెంటర్ లో మహిళా అభ్యర్థి అనుమానాస్పదంగా కనిపించిందని పేర్కొంది. మహిళా అభ్యర్థి తన ఎడమ చేతి మీద కొన్ని జవాబులు రాసుకొని వచ్చిందని తెలిపింది. సదరు మహిళా అభ్యర్థిని ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదని… కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన మహిళా అభ్యర్థి మీద మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది.
ఇక గ్రూప్-1 మెయిన్స్ పేపర్-4 పరీక్షకు 67.4 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. 31,383 మందికి 21,195 మంది రాసినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ వెల్లడించారు. ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ పరీక్ష ఉండగా.. రేపు తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం పరీక్ష జరగనుంది.
ఈ పరీక్షలకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోనే 46 పరీక్షా కేంద్రాలు ఏఱ్పాటు చేశారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ జిల్లాలో 27 ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణను ఆయా జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలే ఏర్పాటు చేసి వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థులు పరీక్ష మొదలు కావడానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రాల్లోకి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30గంట వరకు అనుమతిస్తున్నారు. 1.30 తర్వాత వచ్చేవారిని అనుమతించటం లేదు. పరీక్షలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే 040-23452185, 040-23452186, 040-23452187నంబర్లలో సంప్రదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి.