తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Arikapudi Vs Padi: నువ్వొస్తావా నన్ను రమ్మంటావా, పాడి కౌశిక్‌ వర్సెస్ అరికపూడి గాంధీ.. ఇద్దరు నేతల హౌస్‌ అరెస్ట్…!

Arikapudi Vs Padi: నువ్వొస్తావా నన్ను రమ్మంటావా, పాడి కౌశిక్‌ వర్సెస్ అరికపూడి గాంధీ.. ఇద్దరు నేతల హౌస్‌ అరెస్ట్…!

12 September 2024, 11:39 IST

google News
    • Arikapudi Vs Padi: బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాడి కౌశిక్‌ రెడ్డి సవాలు నేపథ్యంలో అరికపూడి గాంధీ కూడా ఘాటుగానే స్పందించారు. పాడికౌశిక్‌ సవాలును స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. కౌశిక్‌ రాకపోతే తానే అతని ఇంటికి వెళ్తానని  ప్రకటించారు. 
పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం
పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం

పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం

Arikapudi Vs Padi: బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిఏసి ఛైర్మన్‌ పదవి విషయంలో తలెత్తిన రగడతో నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల మధ్య సవాళ్లు సాగుతున్నాయి. శెరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అరికపూడి గాంధీ ఇటీవల పిఏసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో వివాదం రాజుకుంది.

తెలంగాణ అసెంబ్లీలో పిఏసీ ఛైర్మన్‌ పదవితో రేగిన రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా పిఏసీ ఛైర్మన్‌ పదవిని అరికపూడి గాంధీకి దక్కేలా పావులు కదపడంపై బీఆర్‌ఎస్‌ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి అరికపూడి గాంధీ ద్రోహం చేశారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గాంధీ ఇంటి ముందు బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ప్రకటించారు.

అరికపూడి గాంధీ ఇంటి ముందు బీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాలును స్వీకరిస్తున్నట్టు గాంధీ ప్రకటించారు. కౌశిక్‌ రెడ్డి చెప్పినట్టు 11గంటలకు తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానన్నారు.

హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బ్రోకర్‌గా పనిచేసిన వ్యక్తితో తన ఇంటి ముందు జెండా ఎగుర వేయించుకోడానికి తాను సిద్ధంగా లేనని, ఎవరి దమ్ము ఏమిటో చూసు కుందాం రావాలని అరికపూడి గాంధీ సవాలు చేశారు. కౌశిక్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఎలా చేరాడో తనకు తెలుసన్నారు. పోలీసులు కూడా తన ఇంటి వద్ద ఉండాల్సిన అవసరం లేదని ఎవరేమిటో తేల్చుకుంటామన్నారు.

ఎమ్మెల్యేల సవాళ్ల నేపథ్యంలో నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడి కౌశిక్‌ రెడ్డి, అరికపూడి గాందీ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందినా పిఏసీ ఛైర్మన్ పదవి విషయంలో పార్టీకి ద్రోహం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇద్దరు నేతల హౌస్‌ అరెస్ట్‌…

బీఆర్‌ఎస్‌ నేతల సవాళ్ల   నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తన ఇంటి ముందు పాడి కౌశిక్‌ రెడ్డి జెండా ఎగురవేస్తానని సవాలు చేయడంపై గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తన ఇంటికి రావాలని, తానేమి చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు. తాను ఎవరికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని గాంధీ చెప్పారు. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించే విషయంలో సరైన సమయంలో స్పందిస్తానని, తాను చెప్పాల్సింది నాయకులు చేరిందని ప్రకటించారు. 

మరోవైపు  గాంధీ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించిన పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బ్రోకర్ అని దూషించడంపై మండిపడ్డ కౌశిక్‌ రెడ్డి,  పూటకో పార్టీ మారేవాడు బ్రోకర్ అని, ఒకే పార్టీ బీఫారం మీద పోటీ చేసి నిలబడిన వాడు బ్రోకర్ కాదన్నారు.సీఎం అవుతానని చెప్పుకున్న ఈటల రాజేందర్‌ను ఓడించానన్నారు.

గాంధీ ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలని పిలుపు…

కంచెలు వేసి తనను ఆపారని, గాంధీ వ్యవహారంలో ఏమి జరుగుతుందో తెలంగాణ మొత్తం చూస్తోందని, గాంధీ బీఆర్‌ఎస్‌ పార్టీ వాడో కాదో అంతా చూస్తున్నారని,తాను తెలంగాణలో పుట్టానని, ఎక్కడి నుంచో వచ్చి తనకు సవాలు విసిరితే భయపడేది లేదన్నారు.

కేటీఆర్‌, హరీష్‌ రావుతో మాట్లాడి వారి అనుమతితో తాను మాట్లాడుతున్నానని మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంబీపూర్ రాజు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్లడానికి శుక్రవారం కలిసి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న కార్యకర్తలంతా కలిసి శుక్రవారం అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి బ్రేక్‌ఫాస్ట్‌, భోజనం చేసి తెలంగాణ భవన్‌కు తీసుకొద్దామని, అక్కడి నుంచి కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్దామన్నారు. 

కేసీఆర్‌, కేటీఆర్‌ మీద అభిమానం ఉన్న వారంతా అరికపూడి గాంధీ ఇంటికి రావాలని పాడి కౌశిక్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీని నేరుగా కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్దామన్నారు. గాం‎ధీతో తనకు ఏ వ్యక్తిగత వివాదం,  పంచాయితీ లేదని, ఆయన  నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నాడని, బీఆర్ఎస్‌ బీఫాం మీద గెలిచికాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలపడానికి సిగ్గుండాలన్నారు. 

 

తదుపరి వ్యాసం