Medak Crime News : 'ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కానిస్టేబుల్ కొట్టాడు' - మనస్తాపంతో వ్యక్తి సూసైడ్, వెలుగులోకి సూసైడ్ నోట్
07 November 2024, 21:52 IST
- ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తనపట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాశాడు. పెట్రోల్ పొసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి కుటుంబం ఆందోళన చేపట్టింది.
సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య
మొబైల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో అవమానకరంగా మాట్లాడటమే కాదు.. ఒక కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన సదరు వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో మృతుడు తలారి కిషన్ (31) కుటుంబసభ్యులు గ్రామస్థులు అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.
నిప్పంటించుకోవడంతో…
బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ (31) తన మొబైల్ ఫోన్ పోయిందని మంగళవారం రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. అక్కడ ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సాయిలు…. కిషన్ ను తీవ్రంగా కొట్టాడని కుటంబ సభ్యులు ఆరోపించారు.
కానిస్టేబుల్ తీరుతో మనస్థాపానికి గురైన కిషన్ సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి రాంపూర్ లోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అది గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకునేసరికి అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది. కొస ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న… కిషన్ ను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా తాను మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు. అతని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
కుటుంబీకుల ఆందోళన......
కుటుంబసభ్యులకు అతడి వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. ఇందులో “న్యాయం జరగలేదు. ధర్మం చచ్చిపోయింది. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ సాయిలు నన్ను కొట్టాడు” అని రాసి ఉంది. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఫిర్యాదు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ కి వస్తే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకొని… అతడిని తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వారు గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు.
మరొక ఘటనలో యువకుడు:
అనారోగ్య సమస్యలతో మనస్ధాపం చెందిన ఓ యువకుడు వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామానికి చెందిన ముత్తిగాళ్ళ లాలూ (25) చిన్నశంకరంపేటలో ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అతడు కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన లాలూ మూడు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికిన అతని ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గ్రామస్థులకు అతడు గ్రామా శివారులోని పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన కుటుంబసభ్యులు మానసిక వేదనతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉండడం గమనించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.