Medak District : దారుణం... మానసికస్థితి సరిగా లేని కుమారుడిని చంపేసిన తండ్రి
08 August 2024, 16:29 IST
- Son Killed By Father in Medak : మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని కుమారుడిని కన్నతండ్రే కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు.
మెదక్ జిల్లాలో దారుణం
మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మానసిక పరిస్థితి సరిగా లేని కుమారుడిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కర్కశంగా మారాడు. కొడుకు అనే మమకారం లేకుండా మద్యం మత్తులో రోకలి బండతో కొట్టి కన్న తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బుధవారం వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్ద శంకరంపేటకు చెందిన సాయిలు, భూమమ్మ దంపతులకు ప్రశాంత్ ,ప్రదీప్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా పెద్ద కొడుకు ప్రశాంత్ కు వివాహం కావడంతో భార్యతో పక్క ఇంట్లో వేరుగా ఉంటున్నాడు. చిన్న కొడుకు ప్రదీప్ (17) మానసిక వైకల్యంతో ఉండటంతో నిత్యం తండ్రి సపర్యలు చేసేవాడు. కాగా కూలీ పనులకు వెళ్తేనే పూట గడిచే కుటుంబంలో ఇదో పెద్ద సమస్యగా మారింది.
రోకలి బండతో దాడి ........
ఈ క్రమంలో తండ్రి కొడుకుకు సపర్యలు చేయలేక విసుగు చెందేవాడు. అతడు కుటుంబానికి భారంగా మారాడని, ఇంకా ఎన్ని రోజులు భరిస్తామని, తరచూ ఇంట్లో గొడవపడేవాడు. కాగా కొడుకు మానసిక వైకల్యాన్ని భరించలేని తండ్రి బుధవారం రాత్రి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రోకలి బండతో కుమారుడిపై దాడి చేశాడు. తల్లి భుమమ్మ అడ్డుకోబోగా .. ఆమె పైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిందితుడు సాయిలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు ప్రదీప్ తాత పెంటయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపాడు.
సిద్దిపేటలో మరో ఘటన .......
మద్యానికి బానిసై తరచూ కుటుంబసభ్యులతో గొడవ పడుతున్న తండ్రిని, కుమారుడు మరి కొందరి సాయంతో రాళ్లతో కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికొలు గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరికోలు గ్రామానికి చెందిన ఎండీ. ఫకీర్ నబీ (50) వృత్తి రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లి ఊదు (పొగ ) వేస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో నిత్యం తాగి వచ్చి కుటుంబీకులను వేధిస్తుండేవాడు. దీంతో భార్య,కొడుకు అతనికి దూరంగా హైదరాబాద్ వెళ్లి జీవిస్తున్నారు. అయినా మద్యం తాగి వారు ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో బుధవారం వరికోలు సమీపంలో కొందరు వ్యక్తులు ఫకీర్ నబీ పై రాళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. అతనిని హత్య చేసిన ప్రాంతం నుండి కొంత దూరంలో శవాన్ని పడేసి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే [పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ని పిలిపించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కొడుకు జావీద్,ఒక కూతురు ఉన్నారు. కాగా కన్న తండ్రి వేధింపులు భరించలేక తానే హత్యా చేసినట్లు కుమారుడు జావీద్ పోలీసులకు లొంగిపోయాడు.