Chenetha Runa Mafi : చేనేత కార్మికులకు శుభవార్త.. త్వరలో అకౌంట్లలోకి డబ్బులు! 7 ముఖ్యమైన అంశాలు
08 December 2024, 16:09 IST
- Chenetha Runa Mafi : తెలంగాణలో నేతన్నలు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఆర్థిక సమస్యలతో ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. అటు ఆశించిన స్థాయిలో రాబడి లేదు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించింది.
చేనేత కార్మికులకు శుభవార్త
సెప్టెంబరు 9న హైదరాబాద్‌లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. దీంతో నేతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం ఆదేశాలతో అధికారులు కదిలారు. చేనేత శాఖ రుణమాఫీపై కసరత్తు చేపట్టింది. దీనికి సంబంధించిన 7 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.నేతన్నలకు రుణమాఫీ అమలుకు రూ.58 కోట్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు చేనేత శాఖ ప్రతిపాదనలు రూపొందించి నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు దస్త్రం పంపింది.
2.గత ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు రుణమాఫీ అమలు చేసింది. దీంతో 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3.తెలంగాణలోని బ్యాంకులు, చేనేత కార్మికులు, సంఘాలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సమాచారాన్ని.. జిల్లాల నుంచి ప్రభుత్వం సేకరించింది.
4.ఆ వివరాల ప్రకారం.. 7,250 మంది కార్మికులకు రూ.40.10 కోట్ల వ్యక్తిగత రుణాలు, 91 చేనేత సహకార సంఘాలపై రూ.18 కోట్ల మేరకు అప్పులున్నట్లు తేలింది.
5.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. రుణ మాఫీకి రూ.58.10 కోట్లు అవసరమని చేనేత శాఖ ప్రతిపాదనలు పంపింది. కార్మికులు, సంఘాల వారీగా రుణ జాబితాను ఆర్థికశాఖకు అందజేసింది.
6.ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే.. రుణమాఫీ ప్రక్రియను చేపట్టేందుకు చేనేత శాఖ సిద్ధంగా ఉంది.
7.చేనేత రుణమాఫీ కార్యక్రమాన్ని కార్మికులతో భారీఎత్తున నిర్వహించాలని రేవంత్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కార్యక్రమంలోనే రేవంత్ రుణ మాఫీ నిధులను విడుదల చేస్తారని సమాచారం.
తెలంగాణలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత రంగంలో జీవనోపాధి పొందుతున్నారని.. అధికారులు చెబుతున్నారు. వస్త్రాల తయారీలో వస్తున్న అధునాతన సాంకేతిక మార్పుల కారణంగా.. చేనేత రంగంలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నూతన డిజైన్లు, వైవిద్యతతో వస్త్రాల తయారీలో ముందుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నకు చేయూత ద్వారా.. చేనేత కార్మికుడు పొదుపు చేసుకున్న డబ్బుకు రెండింతలు ప్రభుత్వం వాటాగా వారి అకౌంట్లో జమచేస్తోందని అధికారులు వివరిస్తున్నారు.