Jagtial District : అయ్యో బిడ్డా....! ఆర్టీసీ బస్సు ఢీకొని 4 ఏళ్ల బాలుడి ప్రాణం బలి
06 June 2024, 20:52 IST
- Jagtial District News : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 4 ఏళ్ళ బాలుడు ప్రాణాలను వదిలాడు. పరిహారం కోసం చిన్నారి కుటుంబం రోడ్డెక్కింది.
4 ఏళ్ళ బాలుడు మృతి
Jagtial District News : పుచ్చకాయ బాలుడి ప్రాణాలు తీసింది. తల్లి ఒడిలో ఉండాల్సిన బాలుడు రోడ్డుపైకి వచ్చి ఆర్టీసీ బస్సు క్రింద పడి ప్రాణాలు కోల్పోయాడు. కళ్ళముందే కన్నకొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లి తల్లడిల్లి పోయింది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామానికి చెందిన మామిడాల గంగన్న, లత దంపతులకు ఇద్దరు కుమారులు. గ్రామంలోకి పుచ్చకాయలు అమ్మేందుకు రాగా చిన్న కుమారుడు మానస్ (4) తల్లిని పుచ్చకాయ కావాలని కోరాడు. దీంతో తల్లి అతడికి డబ్బులిచ్చి పంపించింది. మానస్ పుచ్ఛ కాయ కొనుక్కుని రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. బస్సు వెనుక టైరు కింద పడి బాలుడు నుజ్జునుజ్జై ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఆడుకున్న బాలుడు క్షణాల్లో అనంతలోకాలకు చేరడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.
పరిహారం కోసం ఆందోళన…
బస్సు బాలుడి ప్రాణాలు తీయడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాలుడి కుటుంబానికి తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని ప్రమాదం జరిగిన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. డ్రైవర్ పై చర్యలు తీసుకుని పాతిక లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునితల్లి లత ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. సముదాయించినా ససేమిరా అన్నారు. చివరకు డ్రైవర్ పై కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
తండ్రి గల్ఫ్ లో….
బస్సు క్రింద పడి ప్రాణాలు కోల్పోయిన బాలుడు తండ్రీ గంగన్న ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్ళాడు. తల్లి ఇంటి పనిలో బిజీగా ఉండడంతో బాలుడు పుచ్చకాయ కోసం రోడ్డుపైకి వచ్చి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు తెలిపారు. తల్లి నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని స్థానికులు అభిప్రాయపడున్నారు. నాలుగేళ్ల బాలుడికి డబ్బులు ఇచ్చి పుచ్చకాయ కొనుక్కొమ్మని బయటికి పంపించడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా పసి బాలుడు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదం నింపింది.