DOPT On IAS: ఆ 11 మంది ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందే… డిఓపిటీ కీలక ఆదేశాలు
10 October 2024, 17:41 IST
- DOPT On IAS: ప్రత్యుష్ సిన్హా కమిటీ కేటాయింపులకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు డిఓపిటి షాక్ ఇచ్చింది. 11మంది ఐఏఎస్‌లు తెలంగాణ నుంచి ఏపీకి తక్షణం వెళ్లాలని డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. పదేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లను ఏపీకి పంపాలని ఆదేశించింది.
11మంది ఐఏఎస్‌లు సొంత రాష్ట్రాలకు వెళ్లాలని ఆదేశించిన డిఓపీటీ
DOPT On IAS: ఏపీ క్యాడర్‌లో ఎంపికై, తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు డిఓపీటీ షాక్ ఇచ్చింది. దాదాపు పదేళ్లు కోర్టు వివాదాలతో సాగుతున్న వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యుష్ సిన్హా కమిటీ ఏపీకి కేటాయించిన 11మంది ఐఏఎస్ అధికారుల్ని తక్షణమే సొంత రాష్ట్రాల్లో విధుల్లో చేరేందుకు రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీజీపీ అంజనీకుమార్, రోనాల్డ్ రాస్, జె.అనంతరాము, ప్రశాంతి ఆమ్రపాలి, అభిలాష బిస్త్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, తదితరుల కేటాయింపులకు DOPT నో చెప్పింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు అందాయి.
2023 జనవరిలో అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో కోర్టు తీర్పు మిగిలిన అధికారులకు వర్తిస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో డిఓపీటీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పనిచేస్తున్న 11మంది ఆలిండియా సర్వీస్ అధికారులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమకు తెలంగాణ క్యాడర్ కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా డివోపీటీ అందుకు అనుమతించలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యుష్ సిన్హా కమిటీ అధికారుల విభజన చేపట్టింది. 52: 48 నిష్పత్తిలో అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయించింది.
అయితే కొంతమంది అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తున్న వారిలో కొందరు రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాల సంఖ్య పెరగడంతో గ్రూప్ 1 అధికారులతో కీలక బాధ్యతలు నెట్టుకొస్తున్నారు.
వారంతా వెళ్లాల్సిందే…
ఈ నేపథ్యంలో 11మంది ఐఏఎస్‌లను సొంత రాష్ట్రాలకు బదిలీ చేస్తూ డిఓపీటీ రాష్ట్రాలకు లేఖ రాసింది. సోమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు తర్వాత మిగిలిన అధికారుల విషయంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. మాజీ డీజీపీ అంజనీకుమార్, రోనాల్డ్ రాస్, జె.అనంతరాము, ఎస్.ఎస్.రావత్, ప్రశాంతి ఆమ్రపాలి, అభిలాష బిస్త్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, తదితరుల కేటాయింపులకు సోమేశ్‌కుమార్ వ్యవహారంలో వెలువరించిన తీర్పే వర్తిస్తుందని తెలిపారు.
తెలంగాణకు కేటాయించిన క్యాడర్ స్ట్రెంగ్త్ కంటే రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో అధికారులు ఉండటంతో అదనంగా అధికారుల్ని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నాయి. 218 మంది కేటాయించాల్సి ఉంటే దాదాపు 50మంది తక్కువగా ఐఏఎస్ అధికారులు ఉన్నారు.
అటు ఏపీలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. దీంతో కేటాయింపుల ప్రకారం తక్షణమే ఎక్కడి వారు అక్కడకు రిలీవ్ కావాలని డిఓపిటి ఆదేశించింది. క్యాట్ ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించినా, తెలంగాణలో కొనసాగుతున్న ఆలిండియా సర్వీస్ అధికారుల వ్యవహారంలో తాజాగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది సోమేశ్‌కుమార్ కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పు అదే తరహా వివాదాలు ఎదుర్కొంటున్న ఆరుగురు అధికారులకు వర్తిస్తుందని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌తో పాటు మరో అయిదుగురు ఆలిండియా సర్వీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేసులో వెలువరించిన తీర్పే వారికి కూడా వర్తిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ను విభజన తర్వాత ఏపీకి కేటాయించినా క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగారు.దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సవాలు చేసింది. సోమేశ్ కుమార్ తక్షణం సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని గత ఏడాది తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు మేరకు ఏపీలో విధుల్లో చేరిన సోమేశ్ కుమార్‌కు అక్కడ ఎలాంటి బాధ్యతలు అప్పగించక పోవడంతో కొద్ది రోజుల తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
సోమేశ్ కుమార్‌తో పాటు మరికొందరు కూడా ఇదే తరహా వివాదాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత తెలంగాణ డీజీపీతో పాటు 12 మంది ఆలిండియా సర్వీసు అధికారుల కేటాయింపునకు సంబంధించిన వివాదంపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లలో ప్రత్యూష్‌కుమార్ సిన్హా కమిటీ ఉత్తర్వులు చెల్లవంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం సవాలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన హైకోర్టు సోమేశ్‌కుమార్ వ్యవహారంలో ఏపీ క్యాడర్ కేటాయింపులు సబబేనంటూ తీర్పును గత ఏడాది వెలువరించింది.
ఆ తర్వాత డీజీపీ అంజనీకుమార్, రోనాల్డ్ రాస్, జె.అనంతరాము, ఎస్.ఎస్.రావత్, ఆమ్రపాలి, అభిలాష బిస్త్‌ల కేటాయింపులకు సోమేశ్‌కుమార్ వ్యవహారంలో వెలువరించిన తీర్పే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌లు వ్యక్తిగత అంశాలకు చెందినవని, వాటిపై వాదనలు వినిపించాల్సి ఉందని చెప్పారు. ఇటీవల ఈ అంశంపై విచారణ పూర్తి కావడంతో 11మంది ఏపీకి రిలీవ్ చేస్తూ డిఓపిటి ఆదేశించింది. వారంతా తక్షణం ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది.
సోమేష్ విషయంలో ఏమి జరిగిందంటే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు హైకోర్టులో 2023 జనవరిలో చుక్కెదురైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయనను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. దీనిపై కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాడర్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని సోమేష్ కుమార్ విభజన సమయంలో క్యాట్‌ను ఆశ్రయించారు. 2015లో సోమేష్ కుమార్‌కు అనుకూలంగా క్యాట్‌లో తీర్పు వెలువడింది. తెలంగాణలో సోమేష్ పని చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.
రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం పంచింది. విభజనలో సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సోమేష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పు ఆధారంగా ఏడేళ్లుగా సోమేష్ కుమార్ తెలంగాణలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో ఆయన సిఎస్‌గా నియమితులయ్యారు.
మరోవైపు 2017లో క్యాట్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సోమేష్ కుమార్‌ను మాతృ రాష్ట్రానికి పంపాలని కోరింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.
సోమేష్ కుమార్ వ్యవహారంలో గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన న్యాయస్థానం సోమేష్ కుమార్ ఏపీకి తిరిగి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది.