Commonwealth Games 2022: డోప్ టెస్టులో విఫలమైన భారత అథ్లెట్లు ధనలక్ష్మీ, ఐశ్వర్య
20 July 2022, 12:28 IST
- కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కాకముంది ఇద్దరు భారత అథ్లెట్లకు చుక్కెందురైంది. స్ప్రింటర్ ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్వర్యా బాబుకు నిర్వహించిన డోప్ టెస్టులో పాజిటివ్ తేలడంతో వీరిద్దరూ ఆ పోటీలకు దూరమయ్యారు.
ధనలక్ష్మీ-ఐశ్వర్య
భారత అథ్లెట్లకు ఇంకా కామన్వెల్త్ పోటీల్లో పాల్గొనకుండా ఆదిలోనే చుక్కెదురైంది. ఇండియన్ టాప్ స్ప్రింటర్ ఎస్ ధనలక్ష్మీ డోఫ్ టెస్టులో విఫలమై.. రాబోయే కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది. అలాగే జాతీయ రికార్డు సాధించిన ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు కూడా డోప్ పరీక్షలో విఫలమైంది. వీరిద్దరూ నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో జులై 29 నుంచి ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అనర్హతకు గురయ్యారు.
24 ఏళ్ల ధనలక్ష్మీ కామన్వెల్త్ పోటీల కోసం ఎంపికైన 36 సభ్యుల భారత అథ్లిటిక్స్ జట్టులో ఒకరు. అథ్లెటింక్స్ ఇంటిగ్రిటీ యూనిట్(AIU) నిర్వహించిన డోప్ టెస్టులో ఈమె నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తేలినట్లు క్రీడా వర్గాల సమాచారం. ఈ కారణంగా ఆమెను బర్మింగ్హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ పోటీలకు దూరం పెట్టనున్నారు. ధనలక్ష్మీ.. ద్యూతీ చంద్, హిమ దాస్, సర్బానీ నంద మాదిరిగా 100 మీటర్లు, 4X100 మీటర్ల రిలేలో పోటీ పడాల్సి ఉంది.
ధనలక్ష్మీ అమెరికాలో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు కూడా అర్హత సాధించింది. అయితే వీసా సమస్య ఆమెకు అక్కడకు వెళ్లడం సాధ్యపడలేదు. 200 మీటర్ల కేటగిరీలో ధనలక్ష్మీ వ్యక్తిగత రికార్డును(22.89 సెకండ్లు) గత నెల 26న జరిగిన కోస్నావ్ మెమొరియల్ అథ్లెటిక్స్ మీట్‌లో అందుకుంది. 23 సెకండ్లలోపు 200 మీటర్లు పూర్తి చేసిన అథ్లెట్లలో సరస్వతీ సాహా(22.82), హిమ దాస్(22.88) తర్వాత ఈ రికార్డును సాధించిన ఏకైక మహిళ ధనలక్ష్మీనే కావడం గమనార్హం.
గత నెలలో 24 ఏళ్ల ఐశ్వర్య బాబుకు సంబంధించిన డోప్ శాంపిల్‌ను నాడా అధికారులు చెన్నైలోని నేషనల్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వీకరించారు. అయితే ఈ టెస్టులో ఫలితం పాజిటివ్‌గా తేలింది. ట్రిపుల్ జంపింగ్‌లో ఐశ్వర్య జాతీయ రికార్డు నెలకొల్పింది. 14.14 మీటర్లు దూకి అరుదైన ఘనత సాధించింది.
టాపిక్