Justin Langer | ఆస్ట్రేలియా కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా
05 February 2022, 8:17 IST
- కష్టకాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోచ్ పదవి చేపట్టి, ఆ టీమ్‌ను టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్ విజేతగా నిలిపిన జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. శుక్రవారం రాత్రి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలతో మీటింగ్ తర్వాత లాంగర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
లాంగర్ కోచింగ్ లోనే ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్, యాషెస్ గెలిచింది
మెల్‌బోర్న్: శనివారం ఉదయమే లాంగర్ తన రాజీనామా సమర్పించినట్లు లాంగర్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ వెల్లడించింది. ఆ సమయంలో లాంగర్ మెల్‌బోర్న్ నుంచి పెర్త్ వెళ్తున్నాడు.
ఈ మేరకు లాంగర్ మేనేజర్ జేమ్స్ హెండర్సన్ ట్విటర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ప్లేయర్‌గా లాంగర్ 5-0 వైట్‌వాష్‌తో తన కెరీర్‌కు ముగింపు పలికాదు. ఇక ఇప్పుడు కొంతమంది విమర్శలు ఎలా ఉన్నా.. అతడు ఆస్ట్రేలియాకు టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్ సాధించిపెట్టాడు అని తన ట్విటర్‌లో హెండర్సన్ అన్నారు. శుక్రవారం సుమారు 8 గంటల పాటు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలతో లాంగర్ సమావేశమయ్యాడు. ఇందులోనే అతడు తన కాంట్రాక్ట్‌పై చర్చించాడు.
కోచ్‌గా లాంగర్ పదవీకాలం ఈ జూన్‌తో ముగియనుంది. అయితే అతడు ఆ తర్వాత కూడా సుదీర్ఘకాలానికి పొడిగింపు కోరాడు. యాషెస్ చివరి టెస్ట్ చివరి రోజు నుంచి ఇప్పటి వరకూ తన కాంట్రాక్ట్ విషయంలో క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. లాంగర్‌తో శుక్రవారం చర్చలు జరిపామని, దీని ఫలితాన్ని త్వరలోనే వెల్లడిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
సీనియర్ ప్లేయర్స్ వల్లే..
అయితే ఆస్ట్రేలియా టీమ్‌లోని సీనియర్ ప్లేయర్స్‌తో లాంగర్‌కు కొంతకాలంగా చెడింది. వాళ్ల అభిప్రాయాల మేరకే లాంగర్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గతేడాది బంగ్లాదేశ్‌లో టీ20 సిరీస్ దారుణ వైఫల్యం తర్వాత లాంగర్ కోచింగ్ తీరుపై ప్లేయర్స్ విమర్శలు గుప్పించారు.
మాజీ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్, ఇప్పటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్.. లాంగర్‌తో చర్చలు జరిపారు. సుదీర్ఘ చర్చల తర్వాత లాంగర్ తన కోచింగ్ స్టైల్ మార్చుకునేందుకు అంగీకరించాడు. దీంతో యాషెస్ వరకూ అతడే కోచ్‌గా ఉంటాడని అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఆ తర్వాత లాంగర్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్, యాషెస్ సిరీస్ గెలిచింది.
అయినా కూడా లాంగర్ కోచ్‌గా కొనసాగడంపై కెప్టెన్లు కమిన్స్, ఫించ్ ఆసక్తి చూపలేదు. లాంగర్ విషయంలో ఇద్దరు కెప్టెన్లతో క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మాట్లాడారు. ఆ తర్వాతే శుక్రవారం లాంగర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ వెంటనే తన పదవికి అతడు రాజీనామా చేయడం విశేషం. మరోవైపు యాషెస్‌లో ఘోర వైఫల్యంతో ఇంగ్లండ్ కోచ్ సిల్వర్‌వుడ్‌పై అక్కడి బోర్డు వేటు వేసిన విషయం తెలిసిందే.