తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni On Jaipur: ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో నా కెరీర్ మరో ఏడాది పెరిగింది.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Dhoni on Jaipur: ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో నా కెరీర్ మరో ఏడాది పెరిగింది.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

28 April 2023, 11:21 IST

google News
    • Dhoni on Jaipur: ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో నా కెరీర్ మరో ఏడాది పెరిగింది అంటూ ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం (ఏప్రిల్ 26) చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత జైపూర్ గురించి ధోనీ ఈ కామెంట్స్ చేశాడు.
ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (IPL)

ఎమ్మెస్ ధోనీ

Dhoni on Jaipur: టీమిండియాలో తన కెరీర్ మరో ఏడాది పెరగడానికి కారణం జైపూర్ లో తాను ఆడిన ఇన్నింగ్సే అని ధోనీ అన్నాడు. గురువారం (ఏప్రిల్ 26) ఆర్ఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతనికిదే చివరి ఐపీఎల్ కావచ్చన్న ఉద్దేశంతో ధోనీ ఎక్కడ ఆడుతున్నా సరే స్థానిక టీమ్ కంటే ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ కే ఎక్కువ మద్దతు పలుకుతున్నారు.

ప్రతి స్టేడియంలో పసుపుమయం అయిపోతోంది. జైపూర్ స్టేడియం కూడా అలాగే మారింది. రాయల్స్ అభిమానులు కూడా ఎల్లో కలర్ జెర్సీల్లో వచ్చి చెన్నైకి మద్దతిచ్చారు. ఒకరకంగా దేశంలోని ప్రతి స్టేడియం ధోనీకి వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇక మ్యాచ్ తర్వాత తనకు జైపూర్ స్టేడియంతో ఉన్న అనుబంధాన్ని ధోనీ నెమరు వేసుకున్నాడు.

టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోనీ 2005లో జైపూర్ లో శ్రీలంకపై 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసిందని ధోనీ చెప్పాడు. "అభిమానులు నన్ను ఎక్కడికెళ్లినా వెంటాడుతూనే ఉంటారు. ఇది నాకు ప్రత్యేకమైన గ్రౌండ్.

వైజాగ్ లో నేను చేసిన తొలి సెంచరీ నాకు మరో పది మ్యాచ్ లను ఇచ్చింది. కానీ ఇక్కడ నేను చేసిన 183 పరుగులు మరో ఏడాది పాటు టీమ్ లో నా స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇది మంచి గ్రౌండ్. నా మనసుకు దగ్గరైన వేదిక. మళ్లీ ఇక్కడికి రావడం చాలా బాగుంది" అని ధోనీ అన్నాడు.

ధోనీ ఆ మాట అనగానే స్టేడియంలోని అభిమానులంతా గట్టిగా అరుస్తూ, చప్పట్లు కొట్టారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు సీఎస్కేతో ఆడిన మ్యాచ్ 200వది. ఈ మ్యాచ్ లో 32 పరుగులతో సీఎస్కేను ఓడించి.. దానిని మరింత మరుపురానిదిగా మార్చుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 202 పరుగులు చేయగా.. తర్వాత చెన్నై 170 పరుగులకే పరిమితమైంది.

తదుపరి వ్యాసం