ప్రపంచ నంబర్ వన్ కు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ కుర్రాడు.. మూడు రోజుల్లో కార్ల్ సన్ పై ప్రజ్ఞానంద రెండు విక్టరీలు
Published Jul 20, 2025 07:41 PM IST
- భారత సంచలన గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అదరగొట్టాడు. ప్రపంచ నంబర్ వన్ కార్ల్ సన్ కు ముచ్చెమటలు పట్టించాడు. మూడు రోజుల్లో రెండు సార్లు మేటి ఆటగాడిని ఓడించాడు.
ఆర్ ప్రజ్ఞానంద
ఇండియన్ యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అదరగొట్టాడు. మూడు రోజుల్లో రెండు సార్లు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించాడు. లాస్ వెగాస్‌లో జరిగిన ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ ఓపెనింగ్ గేమ్ లో నార్వే దిగ్గజ గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ ను ఓడించాడు.
తెల్ల పావులతో
చెస్.కామ్ ప్రకారం 19 ఏళ్ల భారత చెస్ సెన్సేషన్ ఆర్.ప్రజ్ఞానంద తెల్లటి పావులతో ఆడాడు. కార్ల్ సన్ పై ఆధిక్యం ప్రదర్శించాడు. 41 ఎత్తుల్లో ప్రపంచ నంబర్ వన్ ను చిత్తుచేశాడు. ప్రజ్ఞానంద క్లినికల్ గా గేమ్ తో, కచ్చితమైన ఎత్తులతో ఆడాడు. వ్యూహాత్మక గేమ్ ప్లాన్ ను ప్రదర్శించాడు. 18వ కదలికలో బిషప్, నైట్‌కు బదులుగా తన రాణిని త్యాగం చేయాలని నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ సవాలును స్వీకరించిన భారత ఆటగాడు ఆట చివరిలో పైచేయి సాధించాడు.
పుంజుకునే ఛాన్స్ లేకుండా
ప్రజ్ఞానంద 41వ ఎత్తు ద్వారా మూడు సెంట్రల్ పావులను వరుసలో ఉంచి, కార్ల్‌సన్ కు తిరిగి పుంజుకోవడం అసాధ్యం అయిన స్థితిలోకి నెట్టాడు. దీంతో కార్ల్‌సన్ చివరికి ఓటమి ఒప్పుకోక తప్పలేదు. అంతకుముందు లాస్ వెగాస్ చెస్ గ్రాండ్‌స్లామ్ టూర్‌లో ఆధిపత్య రౌండ్ 4 పోరులో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద అద్భుతమైన విజయాన్ని సాధించాడు.
నిలకడైన గేమ్
లాస్ వేగాస్ లో గ్రూప్ ఏ లో అత్యంత నిలకడగా ఆడిన ఆటగాడు ప్రజ్ఞానంద. రెండు నుంచి నాలుగు రౌండ్ల వరకు వరుసగా మూడు విజయాలు సాధించాడు. అందులో చివరిది టోర్నమెంట్‌కు ముందు ఫేవరెట్ కార్ల్‌సన్‌పై అద్భుతమైన విజయం అని చెస్.కామ్ తెలిపింది.
అంతకుముందు బుధవారం (జూలై 16) జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల ఆర్. ప్రజ్ఞానంద నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ కార్ల్ సన్ ను కేవలం 39 మూవ్స్ లో ఓడించాడు. అంతర్జాతీయ చెస్ రంగంలో ప్రజ్ఞానంద స్థానం పెరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనం.
యంగ్ గ్రూప్
ప్రపంచ చెస్ లో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి లాంటి యంగ్ ప్లేయర్లు ప్రపంచ స్థాయిలో అదరగొడుతున్నారు. దీనికి ముందు 2022లో 16 సంవత్సరాల వయసులో ఛాంపియన్స్ చెస్ టూర్‌లో కార్ల్‌సన్‌ను ఓడించినప్పుడు ప్రజ్ఞానంద వార్తల్లో నిలిచాడు. రెండు సంవత్సరాల తర్వాత నార్వే చెస్‌లో నార్వేజియన్‌పై తన తొలి క్లాసికల్ విజయాన్ని సాధించాడు.
