Dasara Second Single: దసరా మూవీ నుంచి సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్
08 February 2023, 18:59 IST
- Dasara Second Single: దసరా మూవీ నుంచి సెకండ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కాబోతోందో మూవీ హీరో నాని ట్విటర్ ద్వారా అనౌన్స్ చేశాడు.
దసరా మూవీలో నాని
Dasara Second Single: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన దసరా మూవీ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో నాని లుక్, ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ లాంటివి దసరా మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడిక ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. దీనిని గురువారం (ఫిబ్రవరి 9) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నాని ట్విటర్ ద్వారా చెప్పాడు.
దసరా నుంచి ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ పాట పక్కా మాస్ బీట్స్ తో స్టెప్పులేయించిన సంగతి తెలుసు కదా. ఇప్పుడు నాని ట్వీట్ ను బట్టి చూస్తే దానికి పూర్తి భిన్నమైన పాట రాబోతోందని అర్థమవుతోంది. "ప్రతి ఏటా వాలెంటైన్స్ డే నాడు ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ హార్ట్ బ్రేక్ సంగతేంటి?" అంటూ నాని ఈ సెకండ్ సింగిల్ టైమ్ ను అనౌన్స్ చేశాడు.
అతడు చెప్పినదాన్ని బట్టి చూస్తే లవ్ బ్రేకయిన తర్వాత వచ్చే సాంగ్ గా కనిపిస్తోంది. ఈ ట్వీట్ లో ఉన్న ఫొటోలో ఓ సైకిల్, దానిపై పగిలిపోయిన గాగుల్స్ చూడొచ్చు. ఈ వాలెంటైన్స్ డేను హార్డ్ బ్రేక్ ఆంథెమ్ తో సెలబ్రేట్ చేసుకోండి అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఉంచారు. ఈ పాటను కోలీవుడ్ కంపోజర్ సంతోష్ నారాయణన్ కంపోజ్ చేశాడు. మరి ఈ పాట ఎలా ఉండబోతోందో గురువారం తేలనుంది.
దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేశాడు. ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతోంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు.
టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. రిలీజ్‌కు వచ్చిన రెస్పాన్స్ కారణంగా రెండు నెలల ముందుగానే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు దాదాపు 29 కోట్లకు సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.
డిజిటల్ రైట్స్ 48 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. శాటిలైట్‌తో పాటు ఓవర్‌సీస్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్‌కు భారీగానే దసరా సినిమా లాభాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలిసింది.