CWG 2026: ఇండియాకు పెద్ద షాకే ఇచ్చిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు.. క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌లకు నో ఛాన్స్
22 October 2024, 14:26 IST
- CWG 2026: ఇండియాకు పెద్ద షాకే ఇచ్చారు కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు. మన దేశానికి మెడల్స్ వచ్చే అవకాశం ఉన్న క్రికెట్, హాకీ, బ్యాడ్మింట్, రెజ్లింగ్, షూటింగ్ లను 2026లో జరగబోయే గేమ్స్ నుంచి తప్పించారు.
ఇండియాకు పెద్ద షాకే ఇచ్చిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు.. క్రికెట్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్‌లకు నో ఛాన్స్
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్ లో ఎన్నో ఏళ్లుగా ఇండియాకు మెడల్స్ పంట పండించిన షూటింగ్, రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ ను 2026లో జరగబోయే గేమ్స్ నుంచి తొలగించారు. ఈ గేమ్స్ గ్లాస్గోలో జరగనుండగా.. బడ్జెట్ ను తగ్గించే ఉద్దేశంతో ఈ ఆటలను పక్కన పెట్టడం గమనార్హం. ఇది ఇండియా మెడల్స్ సంఖ్యపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
మన స్పోర్ట్స్ అన్నీ ఔట్
2026లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ కు గ్లాస్గో ఆతిథ్యమివ్వనుంది. ఆ నగరం తాజాగా ఈ గేమ్స్ లోని ఆటలను పదింటికి కుదించింది. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ లతోపాటు టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయథ్లాన్ లాంటి వాటికి కూడా నో చెప్పింది. కేవలం నాలుగు వేదికల్లోనే ఈ గేమ్స్ జరగనుండటంతో లాజిస్టిక్స్ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
2022లో బర్మింగ్‌హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తో పోలిస్తే ఈసారి మొత్తం స్పోర్ట్స్ సంఖ్య 9 తగ్గింది. ఈసారి గేమ్స్ లో అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, పారా పవర్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్, బారా బౌల్స్, బాస్కెట్ బాల్, వీల్ చెయిర్ బాస్కెట్ బాల్ ఉంటాయని కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వెల్లడించింది.
ఇండియాకు మెడల్స్ కష్టమే
కామన్వెల్త్ గేమ్స్ లో ఎన్నో దశాబ్దాలుగా ఇప్పుడు తొలగించిన స్పోర్ట్స్ లోనే ఇండియా మెడల్స్ ఎక్కువగా సాధించింది. హాకీని తొలగించడం మనకు షాకే. ఈ ఈవెంట్లో ఇండియా కామన్వెల్స్ గేమ్స్ లో పురుషుల టీమ్ మూడు సిల్వర్, రెండు బ్రాంజ్.. మహిళల టీమ్ ఓ గోల్డ్ సహా మొత్తం మూడు మెడల్స్ సాధించాయి.
దీని కంటే పెద్ద షాక్ బ్యాడ్మింటన్ రూపంలో తగిలింది. ఇప్పటి వరకూ కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియాకు మొత్తంగా బ్యాడ్మింటన్ నుంచే 31 మెడల్స్ వచ్చాయి. అందులో 10 గోల్డ్, 8 సిల్వర్, 13 బ్రాంజ్ ఉన్నాయి. ఇక షూటింగ్ లో అయితే ఏకంగా 135 మెడల్స్ ఉన్నాయి. అందులో 63 గోల్డ్, 44 సిల్వర్, 28 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
నిజానికి షూటింగ్ ను 2022లో జరిగిన బర్మింగ్‌హామ్ గేమ్స్ నుంచి కూడా లాజిస్టిక్స్ కారణంగా తొలగించారు. ఇక రెజ్లింగ్ లోనూ ఇండియాకు 114 మెడల్స్ వచ్చాయి. ఇందులో 49 గోల్డ్, 39 సిల్వర్, 26 బ్రాంజ్ ఉన్నాయి. ఇక 2022లో మరోసారి ఈ గేమ్స్ లోకి క్రికెట్ తిరిగి రాగా.. ఇండియన్ వుమెన్స్ టీమ్ సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఇప్పుడీ స్పోర్ట్స్ ఏవీ లేకపోవడంతో 2026లో ఇండియా మెడల్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది.