తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ausw Vs Indw T20 World Cup Semis: వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు.. ఆసీస్ చేతిలో భారత అమ్మాయిలు ఓటమి

AusW vs IndW T20 World Cup Semis: వరల్డ్ కప్ ఆశలపై నీళ్లు.. ఆసీస్ చేతిలో భారత అమ్మాయిలు ఓటమి

23 February 2023, 22:09 IST

google News
    • AusW vs IndW T20 World Cup Semis: మహిళల ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. చివరి వరకు పోరాడిన భారత అమ్మాయిలు తృటిలో మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
భారత్‌పై ఆస్ట్రేలియా విజయం
భారత్‌పై ఆస్ట్రేలియా విజయం (AFP)

భారత్‌పై ఆస్ట్రేలియా విజయం

AusW vs IndW T20 World Cup Semis: మహిళల టీ20 వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయింది. గత సీజన్‌లో ఫైనల్ వరకు చేరిన భారత అమ్మాయిలు ఈ సారి.. సెమీస్‌కే పరిమితమయ్యారు. సౌత్ ఆఫ్రికా కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. చివరి వరకు పోరాడిన భారత వుమెన్స్ జట్టు తృటిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది. పలితంగా మరోసారి రిక్తహస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(52) అర్ధశతకంతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డెనర్, డేసీ బ్రౌన్ చెరో 2 వికెట్లతో రాణించారు.

172 పరుగుల భారీ లక్ష్య ఛేదనంలో టీమిండియాకు శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ షెఫాలీ వర్మను(9) మెగాన్ స్కూట్ ఎల్బీగా వెనక్కి పంపింది. ఆ తదుపరి ఓవర్లోనే ప్రమాదకర స్మృతీ మంధానాను ఆష్లే గార్డెనర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. మరి కాసేపటికే యాసికా భాటియా కూడా రనౌట్‌గా పెవిలియన్ చేరింది. దీంతో 28కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత వుమెన్స్ జట్టు.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా చాలా సేపు నిలువరించారు. వికెట్ పడకుండా కాపాడటమే కాకుండా ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి ధాటిగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. 10 ఓవర్లకే 97 పరుగులు చేసి పటిష్ఠంగా ఉన్న స్థితిలో ఆసీస్ బౌలర్ డేసీ బ్రౌన్.. జెమీమా రోడ్రిగ్స్‌ను ఔట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పింది. అర్ధశతకానికి చేరువలో ఉన్న రోడ్రిగ్స్‌ను(43) పెవిలియన్ చేర్చింది.

అప్పటి నుంచి భారత ఇన్నింగ్స్ గాడి తప్పింది. కాసేపు హర్మన్ ప్రీత్ కౌర్ నిలకడగా రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్ల నుంచి ఆమెకు సాయం కొరవడింది. అయినప్పటికీ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ అర్ధశతకాన్ని పూర్తి చేసుకుంది. అయితే అనవసర పరుగుకు యత్నించి రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్ ఫలితం తారుమారైంది. అప్పటి వరకు మ్యాచ్‌ టీమిండియా వైపు మొగ్గు చూపగా.. అప్పటి నుంచి ఆస్ట్రేలియా వైపు తిరిగింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివర్లో దీప్తి శర్మ(20) మెరుపులు మెరిపించినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టాపోయిన భారత్ 167 పరుగులు చేసింది. 5 పరుగుల తేడాతో ఓడి పోయి టైటిల్ ఆశలపై నీళ్లు చల్లుకుంది. మరోపక్క ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ మనీ అర్ధశతకంతో రాణించగా.. కెప్టెన్ ల్యానింగ్ 49 పరుగులతో ఆకట్టుకుంది. చివర్లో ఆష్లే గార్డెనర్ 31 పరుగులతో మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లతో ఆకట్టుకుంది.

తదుపరి వ్యాసం