Marigold flowers: అనేక రకాల పూలు ఉండగా వేడుకల్లో ఎక్కువగా బంతి పూలు ఎందుకు ఉపయోగిస్తారు?
18 October 2024, 14:05 IST
- Marigold flowers: వేడుక ఏదైనా సరే దానికి ముందుగా అందం తీసుకొచ్చేది అలంకరణ. ఇంటిని అలంకరించుకోవడానికి ఎక్కువగా వినియోగించుకునేది బంతి పూలు. పూజలు, వేడుకలు, ఆచారాలు ఇలా ఏదైనా బంతి పూల అలంకరణ లేకుండా ఉండదు. అన్ని పూలు ఉండగా బంతి పూలే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
బంతి పూలు ఎందుకు అలంకరణకు ఉపయోగిస్తారు
హిందూ ఆచారాలు, పండుగలు, వేడుకలు, పూజ ఏదైనా సరే బంతిపూలతో అలంకరణ లేకుండా పూర్తికాదు. ఇది వేడుకకు ప్రత్యేక అందాన్ని, నిండుదనాన్ని తీసుకొస్తుంది. నారింజ, పసుపు రంగులో ముద్దగా కనిపించే బంతిపూలను చాలామంది ఇష్టపడతారు.
లేటెస్ట్ ఫోటోలు
పండుగలో పూజకు, అలంకరణకు ఎక్కువగా ఉపయోగించే పూలు ఇవే. ఏ ప్రదేశానికైనా తగిన విధంగా సరిపోవడంతో పాటు మంచి రంగును జోడిస్తాయి. వీటిని దేవుళ్ళు, దేవతలకు ఇష్టమైన పూలుగా చెబుతారు. మిగతా పూలతో పోలిస్తే ఎక్కువగా బంతిపూలే ఆచార వ్యవహారాలకు ఉపయోగిస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
సూర్యదేవుడితో సంబంధం
గులాబీలు ప్రేమను, తెలుపు రంగు లిల్లీలు శాంతితో ముడిపడి ఉంటాయనే విషయం అందరికీ తెలిసింది. అలాగే హిందూమతంలో బంతి పూలు సూర్యదేవుడితో ముడిపడి ఉంటాయి. ఇవి ప్రకాశంవంతమైన నారింజ, పసుపు రంగులు కలగలపి ఉంటాయి. సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో ఆకాశంలో కనిపించే ఈ రంగులు బంతి పువ్వును పోలి ఉంటుంది. ఈ పువ్వులు శుభప్రదం. అలాగే ఇది శక్తివంతమైన, పవిత్రమైన అగ్నికి చిహ్నంగా భావిస్తారు.
దేవతలకు ఇష్టం
లక్ష్మీదేవికి కమలం, కాళికా దేవికి మందార పూలంటే ఇష్టం. అలాగే విష్ణుమూర్తి, వినాయకుడు, లక్ష్మీదేవికి కూడా బంతిపూలు అంటే చాలా ఇష్టం. ఇవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కంటికి చూసేందుకు నిండుగా ఉంటాయి. వీటిని ఇంట్లోని పూజ గదిలో లేదా ఆచారాలలో సమర్పించినప్పుడు శాంతిని తీసుకురావడానికి సహాయపడుతుంది. వినాయకుడికి బంతి పూల మాల సమర్పించడం వల్ల ప్రసన్నుడై పనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.
ఈ పూలను వివిధ రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. బంతి పువ్వులను విడదీసి వాటి రేకులు దేవతలు, దేవుళ్ళ విగ్రహాలకు దగ్గర ఉంచొచ్చు. అలాగే బంతిపూలతో చేసిన మాలలు దేవుడి మెడలో అలంకరించడం వల్ల పరిపూర్ణమైన అందం వస్తుంది. బంతి పువ్వు గుండ్రని ఆకారం జీవిత పరిపూర్ణతకు చిహ్నంగా చెబుతారు.
అందాన్ని ఇస్తాయి
పండగ ఏదైనా సరే మార్కెట్లో కళకళలాడుతూ కనిపించేది బంతి పువ్వులే. సులభంగా అందుబాటులో ఉంటాయి. తాజాగా కనిపిస్తాయి. మంచి ఆకర్షణను కలిగి ఉంటాయి. అందుకే ఎప్పుడూ పూజల కోసం బంతిపూలను ఉపయోగిస్తారు. ఇంటి గుమ్మానికి తోరణంగా వాటిని కట్టడం వల్ల చక్కటి సువాసన వెదజల్లుతుంది. దండలుగా వాడినప్పుడు అవి స్థలాన్ని అందంగా మారుస్తాయి. ఇక బంతిపూల రేకులు రంగోలిలో ఉపయోగించడం వల్ల అవి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
బంతిపూలతో చేసిన తోరణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అనేక సంప్రదాయాల ప్రకారం ప్రతికూలత, చెడు శక్తులను దూరంగా ఉంచేందుకు తోరణాలు ఉత్తమమైనవి. అందుకే బంతిపూలతో చేసిన తోరణం ఇంటి గుమ్మానికి తగిలించడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లోకి ప్రవేశించే వారికి మనసుకు హాయినిస్తుంది. శాంతి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్