Vrushabha Rasi 2025 Telugu: వృషభ రాశి ఫలాలు.. శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరం ఇది
06 December 2024, 15:20 IST
- Vrushabha Rasi 2025 Telugu: వృషభ రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న వృషభ రాశి జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
వృషభ రాశి జాతకులకు 2025 రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?
2025 వృషభరాశి రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ తెలుసుకోబోతున్నాం. బృహస్పతి మే నుండి ద్వితీయ స్థానమునందు సంచరిస్తున్నాడు. శని లాభస్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి దశమ స్థానము నందు, కేతువు మే నుండి చతుర్థ స్థానము నందు సంచరించనున్నాడు. ఈ గ్రహ సంచారాల నేపథ్యంలో వృషభరాశి వారికి 2025 సంవత్సరం శుభ ఫలితాలు ఇచ్చు సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసెదరు. ఆదాయ మార్గములను పెంచుకొనెదరు.
లేటెస్ట్ ఫోటోలు
ఎవరెవరికి ఎలా ఉండబోతోంది?
వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కలుగును. మీమీద కొంత విమర్శలు అధికమగును. అయినప్పటికి దీటుగా వాదించెదరు. నూతన వస్తువులను కొనెదరు. గృహ లాభము, వస్తు లాభము కలుగును. విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుచున్నవి.
వృషభరాశి స్త్రీలకు ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికి సమస్యల నుండి బయటపడెదరు. నూతన గృహము, విదేశీ ప్రయాణములు, ఇంటియందు శుభకార్యములు వంటివి కలసివచ్చును. కొత్త పరిచయాలు లాభించును. కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును.
వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం. సినీరంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలసి వచ్చును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలసివచ్చును. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండును. మొత్తం మీద వృషభ రాశి ఈ సంవత్సరం ధనలాభము, వస్తులాభము వంటివి కలుగుచున్నవి.
చేయవలిసిన పరిహారాలు
వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని పూజించటం, కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వలన మరింత శుభఫలితాలను పొందవచ్చు.
వృషభ రాశి 2025 నెల వారీ ఫలితాలు
జనవరి 2025:
కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులకు పునాది వేయడానికి అనుకూలమైన సమయం. ఈ మాసం నందు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఇతరులతో ఆచితూచి సంభాషించాలి. ధనవ్యయముండును. వ్యసనములకు ఖర్చులు అధికమగును. మిత్రుల సహకారముంటుంది. దైవదర్శనము చేస్తారు. శుభకార్యాలకు ప్రయత్నాలు చేస్తారు.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. స్థానచలనం. పిల్లలకు ఆరోగ్యపరంగా సమస్యలు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. తోటి వ్యాపారస్తులతో సమస్యలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో వాగ్వివివాదాలకు దూరంగా ఉండాలి.
మార్చి 2025
ఈ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. శుభకార్యములు చేయుట. ధనం లభించును. వ్యాపారపరంగా ధననష్టము. అనారోగ్య సూచనలున్నాయి. పెద్దవారితో కలహములు. అపరిచితులతో జాగ్రత్త. మీరు చేసే పనులు పూర్తియగును. కోపము అధికంగా వచ్చును.
ఏప్రిల్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. మీరు చేసే ప్రతి పనియందు కలసివచ్చును. విదేశీ ప్రయాణం కొరకు మీరు చేయు ప్రయత్నములు ఫలించును. ఇరుగుపొరుగు వారితో వివాదములేర్పడు సూచనలున్నాయి. వృధా ప్రయాణాలుంటాయి. ప్రతి పనిని మీరు స్వయంగా చూసుకొనుట మంచిది. కీళ్ళ నొప్పులు, దెబ్బలు తగులుట వంటి సమస్యలు ఉంటాయి.
మే 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. సంఘమునందు గౌరవ మర్యాదలుంటాయి. వ్యాపారపరంగా లాభములేర్పడతాయి. మానసికానందం. వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజనం. స్త్రీమూలక ధన వ్యయం. అప్పులు చేయుదురు.
జూన్ 2025:
ఈ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనులు కలసిరావు. స్త్రీలతో సంభాషణలుంటాయి.
జూలై 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మీరు చేయు పనుల యందు జాగ్రత్త లేకపోవటం. ప్రయాణాలయందు ఆటంకాలేర్పడతాయి. మీ మాటల వలన ఇతరులు బాధపడతారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. ధనం కలసివచ్చును. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలించును.
ఆగస్టు 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. గృహ మార్పులు ఉంటాయి. చేసిన మేలు మరచిపోవుదురు. చేయు పనియందు అధిక శ్రమ. నూతన వస్త్రలాభం. ఇరుగు పొరుగు వారితో మాటపట్టింపులు ఉంటాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి సౌఖ్యముండును.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం వృషభ రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. స్నేహితులను కలుస్తారు. శుభకార్యములు నిర్వహిస్తారు. ప్రయాణములలో స్వల్ప ఇబ్బందులుంటాయి. గృహమార్పులు ఉంటాయి. భోజన సౌఖ్యం ఉంటుంది. అయితే చెడు వార్తలు వింటారు.
అక్టోబర్ 2025:
ఈ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. శుభవార్త వింటారు. అకాల భోజనం. ధన సౌఖ్యం ఉండును. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామితో కలసి ప్రయాణము చేస్తారు. కోపావేశములు తగ్గించుకోవడం మంచిది. కోర్టు లావాదేవీలు అంత అనుకూలంగా ఉండవు.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలుంటాయి. దూర ప్రయాణములు చేసెదరు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండును. వ్యాపారస్తులకు సామాన్యం ఫలితాలుంటాయి. ఆచితూచి సంభాషించాలి. పెద్దవారి అండదండలుంటాయి.
డిసెంబర్ 2025:
ఈ మాసం వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉన్నది. మీరు చేసే పనులు పూర్తియగును. ధనము, గౌరవము పెరుగును పెద్దవారితో తిరుగుదురు. విందు భోజనములు చేయుదురు. శుభకార్యాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆభరణాలు కొంటారు.