Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేస్తే.. పితృ దేవతలకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం
26 September 2024, 7:26 IST
Indira Ekadashi Date: ఇందిరా ఏకాదశి ఈ ఏడాది పితృ పక్షంలో వస్తోంది. ఆరోజు ఉపవాస దీక్ష చేయడం ద్వారా పూర్వీకులకి మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం దక్కుతుంది. ఆ ఉపవాసం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఇందిరా ఏకాదశి
Indira Ekadashi Vratham 2024: ఇందిరా ఏకాదశి ఈ ఏడాది పితృ పక్షంలో వస్తోంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా పూర్వీకులకి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఇందిరా ఏకాదశి జరుపుకోనున్నారు.
లేటెస్ట్ ఫోటోలు
ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకులు తృప్తి చెంది భగవంతుని నివాసానికి వెళ్తారని చెబుతారు. ఏకాదశి తిథి 27 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 01:20 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 28 సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 02:49 గంటల వరకు ఉంటుంది.
ఇందిరా ఏకాదశి మహత్యంలో నారద మహర్షి ఈ ఉపవాస పద్ధతిని వివరించడం ద్వారా వైకుంఠ ప్రవేశానికి పూర్వీకులకు మార్గాన్ని చూపారు. ఈ ఉపవాసానికి ఒక రోజు ముందు స్నానం చేసి, ఒక పూట భోజనం చేసి, రాత్రి నేలపై పడుకోవాలని ఆయన చెప్పారు. అలానే విష్ణుమూర్తిని పూజిస్తూ ‘‘కమలనాయన నారాయణా, ఈ రోజు నేను అన్ని సుఖాలకు దూరంగా ఉండి రేపు తింటాను అచ్యుతా. మీరు నాకు ఆశ్రయం ప్రసాదిస్తారు’’ అని పూజించాలన్నారు.
మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో పితృదేవతల సంతోషం కోసం శ్రాద్ధం చేసి అనంతరం బ్రాహ్మణులకు అన్నం పెట్టాలని కూడా ఏకాదశి మహత్యంలో నారదుడు చెప్పారు. పితృదేవతలకు పిండ దానం తర్వాత ఆవుకు ఆహారంగా పెట్టి ధూపదీప నైవేద్యాన్ని వెలిగించి భగవంతుడిని పూజించాలి.
ఆ నారాయణుడికి తులసి ఆకులు, పూలతో పాటు పసుపు బట్టలు, పండ్లు, తియ్యటి పదార్థాలు సమర్పించాలి. ఆ విష్ణుమూర్తికి సాత్విక పదార్థాలు మాత్రమే ఆహారంగా సమర్పించాలనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మరీ ముఖ్యంగా నైవేద్యాలలో తులసి ఉండాలి.
బ్రాహ్మణులు తిన్న తర్వాత మీరు భోజనం చేయాలి. ఇలా ఉపవాసం పాటించడం ద్వారా మీ పూర్వీకులకి కూడా వైకుంఠ ప్రవేశం లభిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.