Uttarakhand Tunnel collapse : మరోసారి నిలిచిపోయిన సహాయక చర్యలు..
18 November 2023, 11:22 IST
- Uttarakhand Tunnel collapse : ఉత్తరాఖండ్‌లో.. 40 మంది కార్మికులు 140 గంటలుగా టన్నెల్‌లోనే ఉన్నారు. కాగా.. శనివారం ఉదయం కూడా సహాయక చర్యలు నిలిచిపోయాయి.
140 గంటలుగా టన్నెల్‌లోనే కార్మికులు.. సర్వత్రా ఉత్కంఠ!
Uttarakhand Tunnel collapse rescue : ఉత్తరాఖండ్‌లో కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 140 గంటలుగా కార్మికులు ఆ టన్నెల్‌లోనే ఉండిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బాధాకరమైన విషయం. శనివారం ఉదయం.. సహాయక చర్యలను తిరిగి ప్రారంభించినప్పుడు భారీ శబ్దాలు వినిపించినట్టు సమాచారం. టన్నెల్లో భయానక పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. డ్రిల్లింగ్‌ని కొనసాగిస్తే.. టన్నెల్ ఇంకా కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు.. సహాయక చర్యలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
ఇలా సహాయక చర్యలను నిలిపివేయడం ఇది వరుసగా రెండోరోజు! శుక్రవారం చేపట్టిన సహాయక చర్యలను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్దాలు రావడం ఇందుకు కారణం.
కార్మికుల కోసం ప్రార్థనలు..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణ దశలో ఉన్న ఓ టన్నెల్ ఆదివారం ఉదయం కూలింది. ఫలితంగా 40మంది కార్మికులు అందులో చిక్కుకున్నారు. ప్రస్తుతం కార్మికులు సురక్షితంగానే ఉన్నారని అధికారులు చెప్పారు. స్టీల్ పైప్స్ సాయంతో వారికి భోజనం, మంచి నీటిని పంపిస్తున్నట్టు వెల్లడించారు.
Uttarakhand Tunnel collapse latest news : కానీ కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారిలో చాలా మంది ఆశలు కూడా కోల్పోతున్నట్టు తెలుస్తోంది. కార్మికుల ఆరోగ్యం దెబ్బతినే ముందే వారిని రక్షించాలని ఇంకొందరు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే విషయంపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని గంటల పాటు టన్నెల్లో చిక్కుకుపోయి ఉంటే.. భౌతిక, మానసిక సమస్యలు వస్తాయని, అందుకు తగ్గ చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం సహాయక చర్యలు ముగిసేంత వరకు.. 245 మీటర్ల వరకు డ్రిల్ చేశారు. ఇది.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు చాలా దగ్గరగా ఉంది. అన్ని అనుకున్నట్టు జరుగుతున్న సమయంలో.. భారీ శబ్దాలు వినిపించడంతో.. సహాయక చర్యలను నిలిపివేయక తప్పలేదు.
Uttarakhand Tunnel collapse : శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. సహాయక చర్యలు మళ్లీ మొదలవ్వాల్సి ఉంది. ఈసారి.. మరో భారీ డ్రిల్‌ని తీసుకొచ్చి.. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. రెండో భారీ డ్రిల్‌ని మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్‌కు తీసుకెళ్లింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 22 టన్నుల బరువు గల ఈ డ్రిల్‌ని సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో.. రవాణా చేసింది.