Woman In Forest : అడవిలో గొర్రెల కాపరికి వినిపించిన అరుపులు.. వెళ్లి చూస్తే షాకింగ్
30 July 2024, 14:23 IST
- Woman In Forest : ఓ గొర్రెల కాపరికి అడవిలో మహిళ ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా ఆమెను గొలుసుతో కట్టేసి ఉంది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించాడు అతడు.
అడవిలో మహిళ
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అడవిలో సాయంత్రంపూట గొర్రెల కాపరికి మహిళ ఏడుపు విని కనిపించింది. గొర్రెలు కాస్తు వెళ్తున్న అతడికి అరుపులు వినిపించడంతో వెళ్లి చూశాడు. అక్కడ గొలుసుతో ఉన్న మహిళను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, ఆమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీని పోలీసులు కనుగొన్నారు. ఆమె వీసా గడువు ముగిసిందని, గత 10 సంవత్సరాలుగా ఆమె భారత్‌లో ఉంటోందని పోలీసులు తెలిపారు.
గొలుసులతో బంధించబడిన మహిళ మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. 50 ఏళ్ల మహిళ లలితా కయీగా గుర్తించారు. సింధుదుర్గ్ జిల్లాలోని సోనుర్లి గ్రామంలోని అడవిలో మహిళను చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టేశారు.
మహిళను చికిత్స కోసం పొరుగున ఉన్న గోవాలోని ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. బలహీనంగా ఉందని, రెండు రోజులుగా ఏమీ తినలేదని వెల్లడించారు. పోలీసులు ఆమె వద్ద ఉన్న మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను కూడా కనుగొన్నారు. ఆమె మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్నట్లుగా తెలిసింది. ఆమె స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
తన మాజీ భర్త తనను అడవిలో చెట్టుకు కట్టేశాడని మహిళ రాసిన నోట్‌లో పేర్కొంది. రాసిన నోట్ ఆధారంగా ఆమె మాజీ భర్తపై హత్యాయత్నం, ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద అక్రమ నిర్బంధం వంటి ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అతనితో పాటు మహిళ బంధువులను కనిపెట్టేందుకు పోలీసు బృందాలు తమిళనాడు, గోవాలను వెతుకుతున్నాయి.
మహిళ వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేయాల్సి ఉందని సింధుదుర్గ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. 'తన మాజీ భర్త తనను బంధించాడని ఆ మహిళ చేసిన వాదన వాస్తవమేనా అని ధృవీకరించడానికి కూడా ప్రయత్నిస్తున్నాం. ఆమె రాసిన నోట్‌ను పరిశీలిస్తున్నాం.' అని అధికారి చెప్పారు.