US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికలు 170 ఏళ్లుగా మంగళవారమే ఎందుకు జరుగుతున్నాయి?
28 October 2024, 14:32 IST
- US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 5న అంటే మంగళవారం ఓటింగ్ జరగనుంది. గత 170 ఏళ్ల చరిత్ర చూసుకుంటే.. మంగళవారం రోజునే యూఎస్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే 170 ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం రోజునే జరుగుతున్నాయి. దీని వెనక చాలా అంశాలు ఉన్నాయి. 1845లో యూఎస్ కాంగ్రెస్ ఓ చట్టం చేసింది. దాని ప్రకారం అప్పటి నుంచి నవంబర్ నెలలోని మెుదటి మంగళవారం ఎన్నికలు జరగుతూ వస్తున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ ప్రధానంగా వ్యవసాయ సమాజంగా ఉన్న కాలంలో నవంబర్ ప్రారంభంలో మంగళవారం ఎన్నికలను నిర్వహించే సంప్రదాయం మెుదలైంది. 1845లో యూఎస్ కాంగ్రెస్ దేశానికి ఒ ఎన్నికల దినాన్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం వ్యవసాయ ఆధారితంగా ఉన్నవారి అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ నవంబర్లో ఓటు వేయడానికి అనువైన సమయంగా పరిగణించారు. అమెరికాలో నవంబర్ ముందు పంటలు పండుతాయి. తర్వాత రైతులకు పని తక్కువగా ఉంటుంది. నవంబర్ తర్వాత తీవ్రమైన శీతాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ సమయాన్ని ఓటు వేసేందుకు ఉత్తమ సమయంగా ఫిక్స్ చేశారు.
మంగళవారాన్ని ఎన్నికల రోజుగా ఎంచుకోవడం అమెరికన్ రైతులు, గ్రామీణ నివాసితుల షెడ్యూల్ ఆధారంగా కూడా ఉంది. శని, ఆదివారాల్లో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపించరు. మరోవైపు ఆదివారం మతపరమైన ఆచారం కోసం కేటాయించిన రోజు. బుధవారం తరచుగా మార్కెట్ రోజు. ఆ రోజుల్లో పోలింగ్ ప్రదేశానికి ప్రయాణించడానికి ఎక్కువ సమయం అవసరం కావచ్చు. దీంతో మంగళవారం ఉత్తమ ఎంపికగా పరిగణించారు. అవసరమైతే సోమవారం ప్రయాణ దినంగా చేసుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమైంది.
కానీ ఆధునిక అమెరికాలో ఈ ఓటింగ్ దినం సౌకర్యవంతం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 2 శాతం కంటే తక్కువ మంది అమెరికన్లు ఇప్పుడు వ్యవసాయంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఓటింగ్ తరచుగా సాధారణ వారాంతపు దినచర్యకు అంతరాయం కలిగిస్తుందని కొందరి వాదన. ఇది తక్కువ ఓటింగ్‌కు దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఎన్నికల రోజును వారాంతానికి తరలించాలని లేదా జాతీయ సెలవుదినంగా మార్చాలని చాలా మంది పిలుపునిచ్చారు. యువతకు మంగళవారం రోజున పని మధ్య సెలవు దొరకడం కష్టంగా మారిందని కూడా చెబుతున్నారు.
2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. మొదటి మంగళవారం నియమం ప్రకారం జరుగుతుంది. ఈ పద్ధతి 2028లో నవంబర్ 7, 2032లో నవంబర్ 2 వంటి తదుపరి ఎన్నికలలో కొనసాగుతుంది.