Pakistan PM: గుణపాఠాలు నేర్చుకున్నాం.. భారత్‍తో చర్చలు కావాలి: పాకిస్థాన్ ప్రధాని
17 January 2023, 12:19 IST
- Pakistan Prime Minister Shehbaz Sharif: భారత్‍తో యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠాలు నేర్చుకుందని ఆ దేశ ప్రధాని అన్నారు. కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు.
Pakistan PM: గుణపాఠాలు నేర్చుకున్నాం.. భారత్‍తో చర్చలు కావాలి: పాకిస్థాన్ ప్రధాని (AP)
Pakistan Prime Minister Shehbaz Sharif: భారత్‍తో మూడు యుద్ధాల తర్వాత తమ దేశం గుణపాఠాలు నేర్చుకుందని పాకిస్థాన్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అంగీకరించారు. యుద్ధాల వల్ల పాకిస్థాన్‍లో నిరుద్యోగం, పేదరికం, అనేక కష్టాలు పెరిగాయని అన్నారు. అలాగే కశ్మీర్ అంశంపై మరోసారి ద్వంద్వ వైఖరిని ఆయన ప్రదర్శించారు. శాంతి పలుకులు పలికారు. దుబాయ్‍కు చెందిన అరబిక్ న్యూస్ ఛానెల్ ఏఐ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‍బాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‍తో గతంలో జరిగిన యుద్ధాల (India, Pakistan Wars) గురించి, కశ్మీర్ అంశం (Kashmir Issue), భారత్‍తో చర్చలపై మాట్లాడారు.
పాక్ గుణాపాఠాలు నేర్చుకుంది
Pakistan PM Shehbaz Sharif: ఇండియాతో యుద్ధాల తర్వాత పాక్ పరిస్థితి దిగజారిందనేలా షెహ్‍బాజ్ అన్నారు. “ఇండియాతో మేం మూడు యుద్ధాలు చేశాం. దీనివల్ల దేశంలో అదనపు కష్టాలు, పేదరికం, నిరుద్యోగం నెలకొంది. మేం గుణపాఠాలు నేర్చుకున్నాం. శాంతితో ఉండాలని అనుకుంటున్నాం. కాకపోతే శాంతి కోసం నిజమైన సమస్యలను పరిష్కరించలిగేలా సామర్థ్యం కలిగి ఉండాలి” పాక్ ప్రధాని షరీఫ్ చెప్పారు.
భారత ప్రధాని మోదీతో చర్చలు కావాలి
Pakistan PM Shehbaz Sharif: కశ్మీర్ లాంటి ప్రధానమైన సమస్యలపై మాట్లాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు కావాలని పాక్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అన్నారు. “కశ్మీర్ లాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు కీలకమైన, నిజాయితీతో కూడిన చర్చలు చేసేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వం, ప్రధాని మోదీకి నేను సందేశం ఇస్తున్నాం. శాంతియుతంగా ఉంటూ అభివృద్ధి సాధించడం లేదా ఒకరితో ఒకరు ఘర్షణ పడుతూ వనరులను వృథా చేసుకోవడం అనే మార్గాలు ఉన్నాయి. ఏది కావాలో మనమే ఎంపిక చేసుకోవాలి” అని షెహ్‍నాజ్ అన్నారు. బాంబులు, ఆయుధాలకు వనరులను ఖర్చు చేయాలని పాకిస్థాన్ కోరుకోవడం లేదని చెప్పారు.
ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, ఒకవేళ యుద్ధమంటూ జరిగితే.. ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలి ఉండరు అని పాక్ ప్రధాని షెహ్‍బాజ్ షరీఫ్ అన్నారు.
కశ్మీర్ తమ దేశ అంతర్గత విషయం అని భారత్ చెబుతున్నా.. పాకిస్థాన్ మాత్రం కుటిలత్వాన్ని కొనసాగిస్తోంది. కశ్మీర్ సమస్య పరిష్కారం అంటూ శాంతి పలుకులు పలుకుతోంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్‍తో పాటు చాలా దేశాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కశ్మీర్ గురించి మాట్లాడే అర్హత పాకిస్థాన్‍కు లేదని ఐక్యరాజ్య సమితి సమావేశాలతో పాటు చాలా అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసింది. అయినా, అదే అంశాన్ని లేవనెత్తుతోంది పాకిస్థాన్. ఇప్పుడు పాక్ ప్రధాని కూడా మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత ప్రధాని మోదీతో చర్చలు కావాలని వ్యాఖ్యానించారు.