Vote for bribe case : ఓటుకు నోటు కేసులపై సుప్రీం సంచలన తీర్పు! ఇక ఆ నేతల ఖేల్ ఖతం!
04 March 2024, 11:38 IST
Vote for bribe : ఓటుకు నోటు కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు 1998కి సంబంధించిన ఓ తీర్పును కొట్టివేసింది.

ఆ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Vote for bribe case Supreme court : అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్లోని ఎంపీలకు.. అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుంచి మినహాయింపు ఉండదని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు.. 1998లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది!
ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ్యులకు.. విచారణ నుంచి మినహాయింపును ఇస్తూ 1998లో తీర్పును వెలువరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2), 194(2 ) పార్లమెంటరీ ప్రివిలేజ్ని పరిగణలోకి తీసుకుని ఈ తీర్పును ఇస్తున్నట్టు నాటి ధర్మాసనం పేర్కొంది. అయితే.. ఆ తీర్పు అర్థం, లంచం తీసుకోవడం అనేది ఆర్టికల్ 105, 194 లకు విరుద్ధంగా ఉన్నాయని తాజాగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు.. నాటి తీర్పును కొట్టివేసింది.. సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం.
Bribes for vote case : "శాసన సభలు, పార్లమెంట్లో ప్రసంగాలు, ఓటు కోసం అవితీనికి పాల్పడ్డారని, లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు. ప్రివిలేజ్ (అధికారాలు)ని తీసుకురావడానికి వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. హౌజ్ మొత్తానికి సంబంధించిన అధికారాలు అవి. ప్రివిలేజ్ పేరుతో చట్టసభ్యులు అవినీతికి పాల్పడి లంచాలు తీసుకుంటే.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే మచ్చపడుతుంది. ఈ విషయాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు కచ్చితంగా అర్థం చేసుకోవాలి," అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాజ్యాంగం పరంగా.. లంచాలు తీసుకోవడం అనేదే అతి పెద్ద నేరం అని, చట్టసభ్యులు అవితీనికి పాల్పడటం అనేది ప్రజా జీవితంలో వారి నైతిక విలువలకు సంబంధించినది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టసభ్యుడు అవినీతికి పాల్పడితే నేరం చేసినట్టే అని పేర్కొంది.
Supreme court latest news : ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత సీతా సోరెన్.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటువేసేందుకు లంచం తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. 2012లో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఆర్టికల్ 15 కింద తనకు మినహాయింపు లభిస్తుందని సీతా సొరేన్ పేర్కొన్నారు. ఝార్ఖండ్ కోర్టు మాత్రం.. సీతా సొరేన్ అపీలును కొట్టిపారేసింది. అనంతరం.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఈ కేసు ముందుకు కదల్లేదు.
కాగా.. ఈ కేసుపై.. 2023 అక్టోబర్లో రెండు రోజుల పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని అందరు ఎదురుచూశారు. చివరికి.. సోమవారం.. తీర్పును వెలువరించింది సుప్రీం ధర్మాసనం. ధర్మాసనంలోని ఏడుగురు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు ఇది. లంచం అనేది పార్లమెంటరీ ప్రివిలేజ్లలో భాగం కాదని వారు తేల్చిచెప్పారు.
వాస్తవానికి ఈ వ్యవహారంపై 1998లో ఇచ్చిన తీర్పులో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లంచం తీసుకుని ఓటు వేసిన చట్టసభ్యులకు.. తీర్పు ద్వారా ప్రొటెక్షన్ లభిస్తోంది. కానీ.. లంచం తీసుకున్నప్పటికీ.. తనకు నచ్చినట్టు ఓటు వేస్తున్న వారిపై మాత్రం విచారణలు జరుగుతున్నాయి!