Nirman portal: ‘సివిల్స్’ ప్రిపరేషన్ కు సహకరించే నిర్మాణ్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
02 July 2024, 21:18 IST
- Kishan Reddy: బొగ్గు గనులున్న ప్రాంతాల్లో యువతులు, వెనుకబడిన వర్గాలకు చెందిన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేవారికి ఆసరాగా నిలిచే నిర్మాణ్ పోర్టల్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి రూ.1 లక్ష ప్రోత్సాహకం ఇస్తారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నిర్మాణ్ పోర్టల్ (Nirman portal) ను ప్రారంభించారు. ఈ పోర్టల్ వెనుకబడిన వర్గాలకు చెందిన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేవారికి ఆసరాగా నిలుస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి రూ.1 లక్ష ప్రోత్సాహకంగా అందిస్తారు.
పారదర్శక విధానం కోసం ‘నిర్మాణ్’ పోర్టల్
-ప్రధానమంత్రి ‘కర్మయోగి’ పథకం ప్రేరణతోనే ‘నిర్మాణ్’ పోర్టల్ ను ప్రారంభించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్మాణ్ (నోబుల్ ఇనిషియేటివ్ ఫర్ రివార్డింగ్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఆఫ్ నేషనల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్) పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మిషన్ కర్మయోగి’ పథకానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ బొగ్గు సంస్థల CSR నిధులతో UPSC సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమినరీ రౌండ్ లో క్వాలిఫై అయిన వారిని ప్రోత్సహించి.. మెయిన్స్, ఇంటర్వ్యూ పరీక్షలకు సిద్ధం చేసే దిశగా ఈ నిర్మాణ్ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందన్నారు.
రూ. 1 లక్ష ప్రోత్సాహకం
ఇందులో భాగంగా.. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన విద్యార్థులకు రూ. 1లక్ష ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. బొగ్గు గనులున్న 39 జిల్లాల్లో UPSC పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు మరీ ముఖ్యంగా.. ఎస్సీ, ఎస్టీ, యువతులు, థర్డ్ జెండర్ వర్గాల వారు ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత ఈ పథకాన్ని వినియోగించుకునే వీలుంది. ఇందుకోసం ఆ అభ్యర్థుల కుటుంబాల వార్షిక వేతనం రూ.8 లక్షలకన్నా తక్కువగా ఉండాలి.
డిజిటల్ ఇండియా స్వప్నానికి అనుగుణంగా..
ఈ పోర్టల్ ను మంగళవారం ప్రారంభించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా స్వప్నానికి అనుగుణంగా.. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్క్రీనింగ్‌లో పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు. ఈ నిర్మాణ్ పథకం అమలు విషయంలో.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ CPSE (సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్) అయిన మహారత్న కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) కీలకభూమిక పోషించడాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు.
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ నినాదంతో.. అభివృద్ధి చెందిన భారత దేశ నిర్మాణం లక్ష్యంగా.. కోల్ ఇండియాతోపాటుగా అనుంబంధ సంస్థలన్నీ బొగ్గు గనులున్న ప్రాంతాల్లో విద్యారంగ అభివృద్ధికి, వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారులకు సరైన విద్యాసదుపాయాలు అందించేందుకు అన్నిరకాలుగా కృషిచేస్తున్నాయని ప్రశంసించారు. ఈ విద్యార్థులు.. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందేందుకు సహాయం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో పాటు బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా, ఇతర సీనియర్ అధికారులు, వివిధ బొగ్గు సంస్థల సీఎండీలు పాల్గొన్నారు.