HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Puja Khedkar : కలెక్టర్‌పై ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వేధింపుల ఆరోపణలు

Puja Khedkar : కలెక్టర్‌పై ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వేధింపుల ఆరోపణలు

Anand Sai HT Telugu

17 July 2024, 6:18 IST

    • Puja Khedkar : మహారాష్ట్రలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికపై దుమారం నడుస్తోంది. అయితే ఆమె పూణే కలెక్టర్‌పై వేధింపుల ఆరోపణలు చేశారు.
పూజా ఖేద్కర్
పూజా ఖేద్కర్

పూజా ఖేద్కర్

ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపికపై వివాదం రావడంతో శిక్షణను నిలిపివేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను నకిలీ చేశారన్న ఆరోపణలపై ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అందుకే మహారాష్ట్రలో ఖేద్కర్ శిక్షణను నిలిపివేశారు. పూజా ఖేద్కర్ ఇప్పుడు ముస్సోరీలోని శిక్షణా కేంద్రానికి హాజరు కావాలని ఆదేశాచాలు వచ్చాయి. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది. ముస్సోరీలోని శిక్షణా కేంద్రానికి జూలై 23లోగా హాజరు కావాలని పూజా ఖేద్కర్‌ను ఆదేశించారు.

ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) పూజా దిలీప్ ఖేద్కర్ జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. LBSNAA ప్రచురించిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ప్రస్తుతం మహారాష్ట్రలోని వాషిమ్‌లో సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్న పూజా ఖేద్కర్ మహారాష్ట్రలో తన శిక్షణా బాధ్యతల నుండి రిలీవ్ అయ్యారు.

వీలైనంత త్వరగా అంటే జూలై 23లోగా ముస్సోరీలోని అకాడమీలో రిపోర్టు చేయాలని ఆమెను ఆదేశించారు. పూజా ఖేద్కర్‌ను సివిల్ సర్వీస్‌కు ఎంపిక చేయడంపై వివాదం చెలరేగిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వికలాంగులు, ఇతర వెనుకబడిన తరగతుల కోటాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూజా.

అయితే పూజా ఖేద్కర్ తన మాజీ బాస్, పూణే కలెక్టర్ సుహాస్ దివాసేపై వేధింపుల ఆరోపణలను మోపారు. సోమవారం సాయంత్రం ఖేద్కర్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను మహిళనని, ఎక్కడైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవచ్చని వాషిమ్‌లోని అధికారులకు తెలిపారు. చివరగా, ఒక మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అందులో ఆమె దివాసే వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వాషిమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుజ్ తారే మాత్రం ఈ విషయంపై వ్యాఖ్యానించలేదు. స్టేట్‌మెంట్ కాపీలను సంబంధిత అధికారులందరికీ పంపారు.

పుణె డివిజనల్ కమిషనర్ చంద్రకాంత్ పుల్కుంద్వార్ కూడా ఖేద్కర్‌ను వివరణ కోరారని, ఆమె దివాసేపై ఇలాంటి ఆరోపణలు చేశారని సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ..'ఆమె ఇంతకుముందు ఎందుకు ఛార్జీలు వేయలేదు? కలెక్టర్‌తో సంభాషించిన తేదీ, సమయం ప్రకటనలో ఎందుకు పేర్కొనలేదు? పూణే కలెక్టరేట్ మెుత్తం సీసీటీవీతో కవర్ అయి ఉంది. యాంటీ ఛాంబర్ మినహా.' అని ఆ అధికారి తెలిపారు.

ఆమె బస చేసిన వాషిమ్‌లోని అతిథి గృహానికి పోలీసులు ఎందుకు వచ్చారని అడిగిన ప్రశ్నకు పూజ ఖేద్కర్, 'నా స్వంత పని కోసం మహిళా పోలీసులను పిలిచింది నేనే. నేను మహిళా పోలీసులను ఎందుకు పిలిచానో మీకు త్వరలో తెలుస్తుంది.' అని అన్నారు.

అధికార దుర్వినియోగ ఆరోపణలపై వచ్చిన వివాదం తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలో పూజా ఖేద్కర్ ప్రయత్నాల వివరాలు బయటకు వచ్చాయి. UPSC ఎంపిక సమయంలో ప్రత్యేక రాయితీలు పొందేందుకు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె దృష్టిలోపం, ఇతర ఇబ్బందులు ఉన్నట్లు పేర్కొన్నారు. తక్కువ పరీక్ష స్కోర్లు ఉన్నప్పటికీ, ఈ రాయితీల కారణంగా ఆమె పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగారు. 821వ ఆల్ ఇండియా ర్యాంక్ పొందారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్