HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Poetic Thief: ‘‘క్షమించండి.. కవి గారి ఇల్లు అని తెలియక దొంగతనం చేశాను’’ - నోట్ పెట్టి వెళ్లిన మంచి దొంగ

Poetic thief: ‘‘క్షమించండి.. కవి గారి ఇల్లు అని తెలియక దొంగతనం చేశాను’’ - నోట్ పెట్టి వెళ్లిన మంచి దొంగ

HT Telugu Desk HT Telugu

16 July 2024, 18:34 IST

  • Poetic thief: మహారాష్ట్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. తాను దొంగతనం చేసింది ఒక ప్రముఖ కవి ఇంట్లో అని తెలిసిన తరువాత ఒక దొంగ.. ఆ ఇంట్లో నుంచి తాను దొంగలించిన టీవీని తిరిగిచ్చేస్తాడు. అంతేకాదు, ‘‘ఇది కవి గారి ఇల్లు అని తెలియక దొంగతనం చేశాను, క్షమించండి’’ అని ఒక నోట్ కూడా పెట్టాడు.

దొంగలించిన టీవీ తిరిగిచ్చేసిన మంచి దొంగ
దొంగలించిన టీవీ తిరిగిచ్చేసిన మంచి దొంగ (Pixabay)

దొంగలించిన టీవీ తిరిగిచ్చేసిన మంచి దొంగ

Maharashtra news: మహారాష్ట్రకు చెందిన ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఓ దొంగ.. ఆ తరువాత ఆ ఇంట్లో తాను దొంగలించిన ఎల్ఈడీ టీవీ సహా పలు ఇతర వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. తాను దొంగతనం చేసింది ప్రఖ్యాత మరాఠీ కవి నారాయణ్ గంగారాం సుర్వే ఇంట్లో అని తెలుసుకున్న తర్వాత అతనికి అపరాధ భావన కలిగింది. దాంతో, ఆ ఆ ఇంట్లో నుంచి తాను దొంగలించిన టీవీని, ఇతర వస్తువులను తిరిగి రహస్యంగా ఆ ఇంట్లో పెట్టేశాడు.

బాత్ రూమ్ గ్లాస్ ను పగలగొట్టి..

సుర్వే 2010లో కన్నుమూశారు. ఆయన కుమార్తె సుజాత ఘరే, ఆమె భర్త గణేష్ ఘరే ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నారు. పట్టణ శ్రామిక వర్గ ప్రజల జీవన పోరాటాల గురించి మరాఠీలో రాసిన కవితలకు గానూ నారాయణ్ గంగారాం సుర్వే ప్రసిద్ధి చెందారు. జూన్ 26న సుజాత, గణేష్ దంపతులు తమ కుమారుడిని చూసేందుకు విరార్ వెళ్లారు. ఈ నెల 14 న వారికి పొరిగింటి వారి నుంచి ఫోన్ వచ్చింది. వీళ్ల ఇంటి బాత్ రూం గ్లాస్ పగలకొట్టి ఉందని, దొంగతనం జరగి ఉండొచ్చని వారు సుజాత, గణేశ్ దంపతులకు చెప్పారు. దాంతో, వారు వెంటనే తిరిగి వచ్చి, దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చాలా సార్లు వచ్చి ఉండవచ్చు..

అయితే, వారికి, ఆ ఇంట్లో, కవి గంగారాం సుర్వే చిత్రపటం పక్కనే, ఒక లేఖ కనిపించింది. అది ప్రముఖ మరాఠీ కవి నారాయణ్ గంగారాం సుర్వే నివసించిన ఇల్లు అని తెలియక అందులో దొంగతనం చేశానని, అందుకే టీవీని, ఇతర వస్తువులను తిరిగి పెట్టేసి వెళ్తున్నానని ఆ లేఖలో ఆ దొంగ రాశారు. ఈ లేఖ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటి హాల్ లో గోడకు కవి నారాయణ్ గంగారాం సుర్వే చిత్రపటం ఉంటుంది. అది చూసి, ఆ దొంగ ఆ ఇల్లు కవి నారాయణ్ గంగారాం సుర్వేదని తెలుసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు, ఆ దొంగ ఆ ఇంటికి దొంగతనం కోసం పలుమార్లు వచ్చి ఉండవచ్చని, చివరగా వచ్చినప్పుడు ఆ చిత్రపటాన్ని గుర్తించి ఉండవచ్చని భావిస్తున్నారు.

వేలి ముద్రల సాయంతో..

అయితే, ఇంకా పలు వస్తువులు కనిపించడం లేదని సుజాత, గణేశ్ దంపతులు పోలీసులకు తెలిపారు. వాటిలో ఎనిమిది కుళాయిలు, వంట పొడి, టేబుల్ ఫ్యాన్, కొన్ని పాత్రలు, ఐదు లీటర్ల వంట నూనె బాటిల్ మొదలైనవి ఉన్నాయని చెప్పారు. టీవీపై, ఆ ఇంట్లోని పలు ఇతర వస్తువులపై ఉన్న వేలిముద్రల సాయంతో ఆ దొంగను పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నేరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివాజీ ధావలే తెలిపారు. కాగా, కవితలు చదివే వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్