తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rk Singh- Kcr | వ్యవసాయ విద్యుత్‌పై సీఎం కేసీఆర్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

RK Singh- KCR | వ్యవసాయ విద్యుత్‌పై సీఎం కేసీఆర్ ఆరోపణలను ఖండించిన కేంద్రం

Manda Vikas HT Telugu

Published Feb 15, 2022 10:11 PM IST

google News
    • ఫిబ్రవరి 11న జనగాం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా అబద్దాలు మాట్లాడారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌.కే సింగ్ అన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.
Minister of power and new & renewable energy RK Singh (HT_PRINT)

Minister of power and new & renewable energy RK Singh

New Delhi | వ్యవసాయ బోర్లు, బావుల వద్ద విద్యుత్ మోటార్లకు మీటర్ పెట్టాలని కేంద్రం మెడపై కత్తి పెట్టిందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 'అపోహలు- వాస్తవాలు' పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 11న జనగాం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా అబద్దాలు మాట్లాడారని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌.కే సింగ్ అన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. సౌర విద్యుత్ కొనుగోలు చేయాలని రాష్ట్రాలను ఒత్తిడి చేయడం లేదని తెలిపారు. ఓపెన్ బిడ్‌ల ద్వారా ఏ సంస్థ నుంచైనా రిన్యూఎబుల్ ఎనర్జీ కొనుగోలు చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని ఆయన స్పష్టం చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) కూడా ఎప్పటికప్పుడు ఓపెన్ బిడ్‌లను నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

బిడ్‌లలో ఖరారు చేసిన ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలా.. వద్దా? అనేది పూర్తిగా రాష్ట్రాల స్వంత నిర్ణయం కాబట్టి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని కేంద్ర విద్యుత్ శాఖ వివరించింది.

వాతావరణంలో పెరుగుతున్న కాలుష్య ఉద్గారాలు, గ్లోబల్ వార్మింగ్ తగ్గించే దిశగా 2050 నాటికి శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి శిలాజ యేతర ఇంధన వనరుల నుంచి లభించే శక్తి వినియోగం పెంచేందుకు ప్రపంచంలోని ప్రధాన దేశాలు వాగ్ధానాలు చేశాయి. అందులో భారతదేశం కూడా భాగంగా ఉంది. 2070 నాటికి కాలుష్య ఉద్గారాలను సున్నాకు తగ్గిస్తామని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. ఇందులోనే రెన్యూవబుల్ ఎనర్జీ పర్చేజ్ ఆబ్లిగేషన్ (RPO) భాగం అని ఆర్.కే సింగ్ అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులకు రుణం ఇచ్చింది కేంద్రమే

జలవిద్యుత్ పైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. జలవిద్యుత్ సామర్థ్యంపై నిర్మించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ అందించిన రుణాలతోనే నిర్మితమవుతున్నాయి. ఈ రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిసి తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ. 55 వేల కోట్లు రుణంగా ఇచ్చాయి. ఇందుకు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఆర్.కే సింగ్ అన్నారు.  ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి ఇలాంటి తప్పుడు, నిరాధారమైన ప్రకటనలు తగవని విద్యుత్ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం