Kazakhstan Flight Crash Video : కజకిస్థాన్‌లో విమానం క్రాష్ తర్వాత లోపల ఏం జరిగింది? బయటకు వచ్చిన వీడియో!
26 December 2024, 6:09 IST
- Kazakhstan Flight Crash Video : కజకిస్థాన్‌లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి లోపల బతికున్న వ్యక్తులు తీసిన వీడియో బయటకు వచ్చింది.

కజకిస్థాన్‌లో విమానం క్రాష్
కజకిస్థాన్‌లోని ఆక్వావ్ సమీపంలో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. సంఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన వారి వీడియో ఫుటేజ్ వైరల్ అవుతోంది. దెబ్బతిన్న క్యాబిన్ లోపల నుండి రికార్డ్ చేసిన వీడియో క్రాష్ తరువాత జరిగిన పరిణామాలను చూపిస్తుంది.
విమాన శిథిలాల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు నానా తంటాలు పడుతుండటం వీడియోలో కనిపిస్తోంది. ఫుటేజీలో విమానం కూలిపోయిన తర్వాత పరిణామాలను చూపిస్తుంది. బితికి ఉన్న ఒక ప్రయాణికుడు శిథిలాల నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండటం కనిపిస్తుంది.
ఎంబ్రేయర్ 190 జెట్‌లో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో అజర్‌బైజాన్ బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగింది. అయితే పక్షి ఢీ కొట్టడం కారణంగానే ఘటన జరిగిందని కొందరు అంటున్నారు. ఎమర్జెన్సీతో విమానాన్ని ఆక్టావ్‌కు దారి మళ్లించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
29 మంది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విమానం క్రాష్ సమయంలో విమానం లోపల నుంచి ప్రయాణికుల రోదనలు వినిపించారు. సంఘటన జరిగిన వెంటనే అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ గ్రోజ్నీకి వెళ్లే అన్ని విమానాలను వెంటనే నిలిపివేసింది. విమానయాన సంస్థ క్రాష్‌పై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తు కోసం ప్రభుత్వ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రష్యాకు చెందిన ఏవియేషన్ వాచ్‌డాగ్ విడుదల చేసిన ప్రాథమిక ఫలితాల ప్రకారం, పక్షి ఢీ కొట్టడం కారణంగా క్రాష్ జరిగి ఉండవచ్చు.
టాపిక్