భారత్ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి
11 August 2022, 9:15 IST
- Suicide attack on army camp : భారత సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించారు.
భారత్ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడి.. ముగ్గురు జవాన్లు మృతి
Suicide attack on army camp : జమ్ముకశ్మీర్‌లోని భారత సైన్యానికి చెందిన శిబిరంపై గురువారం తెల్లవారుజామున ఆత్మహుతి దాడి జరిగింది. రజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటనలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఇదే ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సైతం మరణించారు.
రజౌరీ జిల్లా దర్హల్ ప్రాంతంలోని సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. వారి చర్యలను సైన్యం ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు- భద్రతాదళాల మధ్య ఎన్కౌంటర్ సంభవించింది.
"కొందరు ఉగ్రవాదులు.. పార్గల్ ఆర్మీ క్యాంప్ ఫెన్స్‌ను దాటేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు సెంట్రీ కాల్పులు జరిపారు. అనంతరం ఎన్కౌంటర్ మొదలైంది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు," అని ఆడేజీపీ ముకేశ్ సింగ్ వెల్లడించారు.
ఈ ఆత్మహుతి దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు సైన్యం అనుమానిస్తోంది.
పుల్వామా జిల్లాలో 25కేజీల ఐఈడీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న ఒక రోజు వ్యవధిలో ఈ ఆత్మహుతి దాడి జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. ఈ ఘటనలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
టాపిక్