తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట; ఆ మహిళలు ఆశ్రమంలో ఇష్టంతోనే ఉంటున్నారని స్పష్టీకరణ

Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు సుప్రీంకోర్టులో ఊరట; ఆ మహిళలు ఆశ్రమంలో ఇష్టంతోనే ఉంటున్నారని స్పష్టీకరణ

Sudarshan V HT Telugu

18 October 2024, 15:04 IST

google News
  • Sadhguru Jaggi Vasudev: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఫౌండర్ సద్గురు జగ్గీ వాసుదేవ్ కు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన ఇద్దరు కూతుళ్లను జగ్గీ వాసుదేవ్ బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ డాక్టర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్
సద్గురు జగ్గీ వాసుదేవ్

సద్గురు జగ్గీ వాసుదేవ్

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఈషా ఫౌండేషన్ పై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఇద్దరు కూతుర్లను ఈశా ఫౌండేషన్ లో బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో తన ఇద్దరు కుమార్తెలు గీత (42), లత (39)లను బందీలుగా ఉంచారని ఆరోపిస్తూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

సీజేఐ ధర్మాసనం

పిటిషనర్ పేర్కొన్న ఇద్దరు మహిళలు మేజర్లని, వారు స్వచ్ఛందంగా, ఎటువంటి బలవంతం లేకుండా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో నివసిస్తున్నారని తేలిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈషా ఫౌండేషన్ అక్రమంగా నిర్బంధించిన తన కూతుర్లను కోర్టు ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కామరాజ్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 3న ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీసులు స్టేటస్ రిపోర్టును తమ ముందు సమర్పించారని పేర్కొంది.

విచారణ అనవసరం

పిటిషనర్ ఇద్దరు కూతుళ్లు మేజర్లని, వారు స్వచ్ఛందంగా జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఆశ్రమంలో నివసిస్తున్నారని, వారు ఎప్పుడు కోరుకుంటే, అప్పుడు ఆశ్రమం నుంచి బయటకు వెళ్లవచ్చని, హెబియస్ కార్పస్ పిటిషన్ కు సంబంధించి తదుపరి ఆదేశాలు అవసరం లేదని, అందువల్ల ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హెబియస్ కార్పస్ ప్రొసీడింగ్స్ మూసివేయడం వల్ల ఈషా యోగా సెంటర్ నిర్వహించాల్సిన ఇతర రెగ్యులేటరీ నిబంధనలపై ఎలాంటి ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంతర్గత ఫిర్యాదు కమిటీ..

సంస్థలో మహిళలు, మైనర్ పిల్లలు ఉన్నప్పుడు అంతర్గత ఫిర్యాదు కమిటీ ఉండాలని, అలాగే, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందని, ఆ నిబంధనల ఉద్దేశం సంస్థను కించబర్చడం కాదని సుప్రీంకోర్టు (supreme court) వ్యాఖ్యానించింది. ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో అక్రమ నిర్బంధం ఆరోపణలకు మద్దతుగా తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోయంబత్తూరులోని తొండముత్తూరులోని ఆశ్రమంలో ఇద్దరు మహిళలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మద్రాసు హైకోర్టు సెప్టెంబర్ 30న పోలీసులను ఆదేశించింది.

తదుపరి వ్యాసం