ఇక సామాన్యుడి భాషలో చట్టాలు
30 April 2022, 15:42 IST
న్యాయస్థానాల్లో స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యాయమూర్తులను కోరారు. అలాగే, కాలం చెల్లిన చట్టాలను వదిలించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చట్టాలను రాసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల జాయింట్ కాన్పెరెన్స్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల జాయింట్ కాన్పెరెన్స్‌లో శనివారం ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. స్థానిక భాష వాడడం వల్ల సామాన్యుల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం ఇనుమడిస్తుందని ప్రధాని వివరించారు. జైళ్లల్లో మగ్గుతున్న విచారణ ఖైదీలకు సంబంధించిన కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అకారణంగా శిక్ష అనుభవిస్తున్నవారిక సాధ్యమైనంత త్వరగా న్యాయం అందించాలని ప్రధాని మోదీ కోరారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు విధానపరమైన నిర్ణయం మాత్రమే కాదని, అవి మానవీయ విలువలను కాపాడేవని వ్యాఖ్యానించారు. విచారణ ఖైదీలకు సంబంధించి ప్రతీ జిల్లాలో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి, కేసుల విచారణను సమీక్షించాలని, అర్హులైన వారికి సత్వరమే బెయిల్ లభించేలా చూడాలని కోరారు. మానవీయ విలువలకు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంలకు, సీజేలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
రెండు రకాల భాషల్లో..
అన్ని చట్టాలను రెండు రకాలుగా రూపొందించే ప్రయత్నం జరుగుతోందని ప్రధాని వెల్లడించారు. ఒకటి న్యాయ పరిభాషలో, మరొకటి సామాన్యుడికి అర్థమయ్యే సులువైన భాషలో రూపొందించడానికి ఒక బృందం పనిచేస్తోందని వివరించారు. పలు దేశాల్లో ఇలా రెండు రకాలుగా చట్టాలను రూపొందిస్తున్నారని తెలిపారు. మరోవైపు, అన్ని స్థానిక భాషల్లో కేసుల విచారణ జరగాల్సిన, కోర్టుల్లో స్థానిక బాషను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు.
పనికిరాని చట్టాలను వదిలేయాలి
ప్రజలకు సత్వర న్యాయం అందించడంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ కోరారు. కాలం చెల్లిన చట్టాలను వదిలించుకోవాలని సీఎంలకు సూచించారు. `2015లో కాలం చెల్లిన 1800 చట్టాలను గుర్తించాం. వాటిలో 1450 చట్టాలను రద్దు చేశాం. కానీ రాష్ట్రాలు మాత్రం అలాంటి 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయి` అని తెలిపారు. కోర్టుల్లో ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
సాంకేతిక సహకారం
కేసుల నిర్వహణలో సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. విదేశాల్లోని న్యాయ కళాశాలల్లో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మొదలైన వాటిని కూడా సిలబస్‌లో చేర్చారని తెలిపారు. భారత్‌లోనూ లా కాలేజ్‌ల్లో అవసరమైన సాంకేతిక కోర్సులు సిలబస్‌లో భాగంగా ఉండాలన్నారు.
మధ్యవర్తిత్వం ద్వారా..
అవకాశం ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేయాలని, దాంతో, పెండింగ్ కేసుల భారం తగ్గుతుందని ప్రధాని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించే విధానం భారత్‌లో వేల ఏళ్లుగా కొనసాగుతోందని గుర్తుచేశారు. అందుకే, మీడియేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టామన్నారు.