Goa flight: గోవా ఫ్లైట్ లో బాయ్ ఫ్రెండ్ కు వినూత్నంగా ప్రపోజ్ చేసిన యువతి; సోషల్ మీడియా ఫిదా..
29 August 2024, 15:50 IST
హరియాణాలోని పంచకులకు చెందిన ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ కు వినూత్నంగా ప్రపోజ్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఫ్రెండ్స్ వెనుక నిల్చుని ‘విల్ యూ మ్యారీ మీ’ అనే ప్లకార్డ్స్ పట్టుకుని ఉండగా, గోవా ఫ్లైట్ లో ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ కు మోకాళ్లపై కూర్చుని లవ్ ప్రపోజ్ చేసింది.
గోవా ఫ్లైట్ లో బాయ్ ఫ్రెండ్ కు ఐశ్వర్య లవ్ ప్రపోజల్
ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమికులు రకరకాల వినూత్న, సృజనాత్మక మార్గాలను వెతుకుతుంటారు. సాధారణంగా, లవ్ ను ప్రపోజ్ చేసే విషయంలో అబ్బాయిలు ముందుంటారు. కానీ, ఈ లవ్ స్టోరీలో ఆ రోల్ అమ్మాయి తీసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు తన లవ్ ప్రపోజల్ ను కొత్తగా, క్రియేటివ్ గా చెప్పాలనుకుంది.
ఫ్లైట్ లో లవ్ ప్రపోజల్..
ఆకాశంలో ఉండగా, తన ప్రేమను వ్యక్తం చేయాలని హర్యానాలోని పంచకులకు చెందిన ఐశ్వర్య బన్సాల్ (26) అనే యువతి భావించింది. తన బర్త్ డే రోజు బర్త్ డే పార్టీ కోసం ఐశ్వర్య తన 30 మంది స్నేహితులతో కలిసి గోవా వెళ్లడానికి ప్లాన్ చేసింది. అందుకు చండీగఢ్ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ను వేదికగా ఎంచుకుంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ కు ముందే విషయం చెప్పింది. ‘విల్ యూ మ్యారీ మీ’ అనే నాలుగు పదాలను నాలుగు ప్లకార్డులపై రాసి వారికి ఇచ్చింది. విమానం ప్రయాణిస్తుండగా, మోకాళ్లపై కూర్చుని, బాక్స్ లో నుంచి ఉంగరాన్ని బయటకు తీసి తన బాయ్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసింది. అదే సమయంలో, తన ఫ్రెండ్ వారి సీట్లలో లేచి నుల్చని, ‘విల్ యూ మ్యారీ మీ’ ప్లకార్డులను పట్టుకున్నారు. అలాగే, అదే సమయంలో విమానంలో 'స్పెషల్ అనౌన్స్మెంట్' వచ్చేలా ప్లాన్ చేసింది. ఇంత ప్రేమగా, క్రియేటివ్ గా చేసిన ప్రపోజల్ ను ఎవరైనా కాదనగలరా?.. అతడు అవునని యాక్సెప్ట్ చేయగానే, అతడి వేలికి ఉంగరం తొడిగి, అతడిని మద్దు పెట్టుకుంటుంది. ఐశ్వర్య బన్సాల్ (26) ధైర్యం, క్రియేటివిటీ నెటిజన్లను విస్మయానికి గురిచేసింది.
ఇన్ స్టా లో వీడియో..
ఈ మొత్తం ఘటనను వీడియో తీసి తన ఇన్ స్టా అకౌంట్ లో ఐశ్వర్య బన్సాల్ (26) పోస్ట్ చేసింది. ఆ ఇన్స్టా గ్రామ్ రీల్ కు 6.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆమె లవ్ ప్రపోజ్ చేసిన స్టైల్ కు ఫిదా అయ్యారు. ‘‘మేము ఫ్లైట్ ఎక్కేటప్పటికి నా బాయ్ ఫ్రెండ్ అమూల్యకు తన కోసం ఎదురుచూసే సర్ప్రైజ్ గురించి తెలియదు. నేను దీని కోసం సిద్ధం అవుతున్నప్పుడు అతను నిద్రపోతున్నాడు. పనులు సజావుగా సాగాలంటే చాలా ప్లానింగ్ చేయాల్సి వచ్చింది. ప్రతిపాదనను అనుమతించడానికి విమాన సిబ్బందిని ఒప్పించడం కష్టమైంది. ప్రతిదాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సి వచ్చింది" అని ఐశ్వర్య చెప్పారు. ఇలాంటి అసాధారణ నేపధ్యంలో ప్రపోజ్ చేయడానికి ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ,'అమూల్యకు గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాను. భూమికి 30,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న విమానంలో ప్రపోజ్ చేయడం కంటే మంచి క్షణం ఏముంటుంది.
బాయ్ ఫ్రెండ్ కూడా..
ఐశ్వర్య మాత్రమే కాదు. ఆమె బాయ్ ఫ్రెండ్ అమూల్య కూడా గోవాలోని ఓ బీచ్ లో ఒక గొప్ప ప్రపోజల్ కు ప్లాన్ చేశాడు. ‘‘అది నాలాగే పర్ఫెక్ట్ గా ఉంది. మా ఇద్దరి ప్రణాళికలు మా మ్యూచువల్ ఫ్రెండ్స్ కు తెలుసు, కానీ వారు, తెలియనట్లుగా బాగా నటించారు’’ అని ఐశ్వర్య చెప్పారు.
సోషల్ మీడియా బజ్
ఇన్ స్టాగ్రామ్ (INSTAGRAM) లో ఈ లవ్ ప్రపోజల్ రీల్ పోస్ట్ చేయగానే సోషల్ మీడియా (social media) లో అది దావానలంలా వ్యాపించింది. ప్రస్తుతం ఈ జంటకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, యూజర్ల నుంచి అభినందనలు, శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ధీరజ్ సనప్ అనే వీడియో క్రియేటర్ ఈ జంట హనీమూన్ స్పాన్సర్ చేయమని విమానయాన సంస్థలను ట్యాగ్ చేశాడు. "మేము నర్సరీ నుండి ఒకరికొకరు తెలుసు. మాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం'’’ అని ఐశ్వర్య చెప్పింది.