Pakistan Mosque Blast: మసీదులో భీకరమైన బాంబు దాడి.. 46 మంది మృతి.. 150 మందికి గాయాలు
30 January 2023, 22:38 IST
- Pakistan Mosque Blast: పాకిస్థాన్‍లో భీకర బాంబు దాడి జరిగింది. పెషావర్ (Peshawar)లోని మసీదుపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.
Pakistan Mosque Blast: మసీదులో ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది
Pakistan Mosque Blast: పాకిస్థాన్‍లో ఘోరం సంభవించింది. ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం (జనవరి 30) భీకరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ బాంబు పేలుడు ఘటనలో 46 మంది మృతి చెందారని, 150 మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Pakistan - Peshawar Mosque Blast: ఈ బాంబు దాడికి తామే పాల్పడ్డామని పాక్ తాలిబన్ కామాండర్ సర్బకఫ్ మొమంద్ ప్రకటన విడుదల చేశారు. వందలాది మంది ప్రజలు సామూహికంగా మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అక్కడి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏపీ రిపోర్ట్ వెల్లడించింది.
Peshawar Mosque Blast ఈ బాంబు పేలుడుతో పెషావర్‌లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని, శిథిలాల కింద ఉన్న వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఖండించిన పాకిస్థాన్ ప్రధాని
Pakistan - Peshawar Mosque Blast: ఈ బాంబు దాడిని పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan Prime Minister Shahbaz Sharif) తీవ్రంగా ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను, ఈ దాడిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ బాంబు దాడిపై స్పందించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పెరుగుతున్న ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు తమ దేశం నిఘా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, పోలీసు బలగాలను పెంచుకోవడం చేయాలని ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, అమాంతం అధికమవుతున్న ద్రవ్యోల్బణంతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. ఉగ్రవాద సమస్య కూడా జఠిలం అవుతోంది.